Sunday 16 October 2016

సూక్ష్మంలో మోక్షం...

సూక్ష్మం లో మోక్షం
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం పుచ్చిపోయినట్లే. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము. భా.నా.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి,  నీ ఇంటికి వచ్చాడు కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు  అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తోలిగిపోతుంది.
మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి. నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు. నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో. జాగ్రత్త.
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి.  కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.....భాస్కరానంద నాథ. 17/8/2014.

Thursday 13 October 2016

అభిమంత్రించుట ...

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః....

ఈ జగత్తు లోని సమస్త మాతృమూర్తులకు నమస్కరిస్తూ .....

శ్రీ మహా విష్ణువుకు బొడ్డులో నుంచి బ్రహ్మ దేవుడు పుట్టాడు....బ్రహ్మ దేవుడు అంటే సృష్టి ....సమస్త సృష్టి ఆ మహా విష్ణువు లో నుంచి పుట్టినది....ఆడవాళ్లు బిడ్డను కన్నప్పుడు బిడ్డతో బాటు ఓ నరం వస్తుంది....ఆ బొడ్డు కోసి బిడ్డను తల్లిని వేరు చేస్తారు....ఈ పక్రియ ఆడవాళ్లలోనే జరుగుతుంది....గర్భసంచి ఆడవాళ్లలోనే కలదు....మరి విష్ణుమూర్తి స్త్రీ యే కదా....గర్భసంచి వున్నది కదా!

అదుగో ఆ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని విష్ణు సహస్రనామం కాని, లలితా సహస్రనామం కాని చదివితే, అమెరికాలో వుండే మీ పిల్లలకు ఆ పూజా ఫలం చెందుతుంది....మీ బొడ్డు చల్లగా వుంటుంది...అంటే మీ పిల్లలు చల్లగా వుంటారు....కర్పూర హారతి భగవంతుడికి ఇచ్చిన తరువాత మనం కళ్లకు అద్దుకొని, మరలా హారతి బొడ్డుకు అద్దుకోవాలి....భా.నా. పిల్లలు దగ్గర లేరే,.... వాళ్లు దూరంగా వున్నారే.....వాళ్లు పూజలు చేయలేరే అని అనుకోకండి.....మీ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని సంకల్పం చేయండి....పూజ అయిన తరువాత, పరమేశ్వరుడి వదిలిన నీళ్లు, పుష్పం మీ బొడ్డుకు తాకించి భావన చేయండి....అవి మీ బిడ్డ తల మీద అక్షింతలు లాగ పడతాయి....మీ బొడ్డు యే మీ చిరంజీవుల తలలు.....అమ్మ కడుపు చల్లన...అని అంటే అర్ధం ఇదే.......ఈ ప్రయోగం నేను ఎంతమంది చేతనో చేయించాను....భానా..ముఖ్యంగా దూరంగా వుండే పిల్లల కోసం....

అదే పిల్లలు లేని వారు అదే బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని 40 రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామం చేస్తే పిల్లలు పుడతారు....నిజం.....నేను చెప్పిన తరువాత ఎందరికో అలా పుట్టినారు.

అలాగే భర్త ఊళ్లో లేనప్పుడు గానీ, దూర దేశాలలో వున్న వారి క్షేమం కోసం భార్య తన మాంగళ్యం మీద చేయి వుంచి 40 రోజులు లలితా సహస్రనామం చదివితే తప్పక ఆరోగ్యవంతుడు అవుతాడు...

భర్త కోపతాపాలతో అలిగి వెళ్లినప్పుడు, భర్త యొక్క కండువ గాని, పంచె గాని, చివరకు చేతి గుడ్డ అయినా సరే తీసుకొని తన కుడి ప్రక్కన బొడ్డులో దొపుకొని లలితా సహస్రనామం 40 రోజులు నిష్ఠతో చేస్తే పాతాళంలో వున్నా సరే గుర్రం ఎక్కి పరుగెత్తుకొని వస్తాడు....బొడ్డుకు అంత ప్రాముఖ్యత వున్నది మంత్ర శాస్త్రములో....

గురువులను వీణ మీటినట్లుగా అతి సున్నితంగా కదిలిస్తే ఎన్నో విషయాలు మనకు చెబుతారు...ఓకరు అడిగిన ప్రశ్నకు నా సమాధానము ఇది....
శ్రీమాత్రేనమః......భాస్కరానంద నాథ./10-10-2016

Saturday 20 August 2016

ప్రశ్నలు - 1

శుభం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానములు

౧ ప్రతిమంత్రానికి బీజం, శక్తి, కీలకం ఉంటాయని విన్నాను. ఈ మూడిటి స్వరూపం ఏమిటి? వీటిమధ్య భేదమేమిటి? ఏదేమిటో ఎలా తెలుస్తుంది? బీజశక్తికీలకాలు తెలియకపోవటం సాధకుని బాధిస్తుందా?

దీని గురించి ఇంతకు ముందే చెప్పడం జరిగినది. 
కారణ బిందువు నుండి ౧) కార్య బిందువు, ౨) అందుండి నాదము ౩) అందుండి బీజము అను మూడు పుట్టు చున్నవి. ఈ మూడును పర, స్థూల, సూక్ష్మ పదముల చే చెప్పబడు చున్నవి. కాబట్టి బిందువు స్థూల, సూక్ష్మ, పరమని మూడు విధములుగా చెప్ప బడుచున్నవి. బిందువు గురించి తెలిస్తే బీజము గురించి తెల్సినట్లే.  బిందువే బీజమునకు  మూలము.. ఇవన్నీ అతి రహస్యములు గురు-శిష్య పర౦పర ద్వారా తెలుసుకోదగిన విషయములు. ఉపాసన, ఉపదేశం లేని వారికి ఈ బీజ శక్తి కీలకములు లేకుండా చేయడం ఉత్తమం. బీజ సహితముగా చేయడం వలన తొందరగా మంత్రము సిద్దించును. బీజ రహితముగా చేసినందువలన సాధకునికి ఎటువంటి ఇబ్బంది లేదు, వచ్చే ప్రమాదము లేదు. పట్టు తొందరగా కుదరదు అంతే. బీజ శక్తి కీలకములను ఉపదేశము ద్వారా, దీక్ష ద్వారా గురువులు తమ శిష్యులకు మంత్రమును ఇచ్చెదరు. అప్పుడే అది పరి పూర్ణము అగును. దాని శక్తి అమోఘము. అర్హత లేని వారికి ఇలా బీజ రహిత మంత్రములను ఇచ్చెదరు. ఇది గురువులు తమ శిష్యులను పరీక్షించి, వారి స్థాయిని బట్టి ఇచ్చెదరు. అందుకే సద్గురువులు కావలెను అని అందురు.

౨ ఉదాహరణకు తీసుకుంటే శ్రీరామరక్షాస్తోత్రానికి సీత శక్తి, హనుమంతుడు కీలకం అంటారు. బీజం చెప్పలేదు. అలాంటప్పుడు బీజమేమిటో ఎలా తెలిసేది? సాధనద్వారా మాత్రమే తెలిసే విషయాలా ఇవి?

అంతర్లీనంగా, అంతర్గతముగా రామ బీజము ఇందులో కలదు. ప్రకటితముగా చెప్పబడలేదు. కానీ ప్రాచీన హిందీ, సంస్కృత ప్రతులలో బీజము చెప్పబడివున్నది.
ఇది కూడా మంత్ర రహస్యమును కాపాడ దానికే పెద్దలు, గురువులు ఇలా చేస్తూ వుంటారు. గురు ముఖ:ముగా వచ్చినప్పడు మంత్రముగానీ, స్తోత్రము గానీ పూర్తి స్థాయిలో చెప్పబడుతుంది. లేదంటే అన్యుల చేతికి దొరికినప్పుడు చాలా ప్రమాదము సంభవించును. ఇవన్నీ formula లాంటివి. బ్రహ్మాస్త్రముల formula ఇతరులకు దొరకకూడదు. దాని వలన చాలా అనర్ధములు కలుగును. అందుచేత మన ఋషులు చాలా గుప్తముగా ఉంచినారు మంత్ర శాస్త్రమును.
తారక మంత్రము ఏక బీజాక్షరము. బీజాక్షరములలో ఏకము చాలా శక్తిమంతమైనది. దానిని తట్టుకోవడము చాలా కష్టము. అందు చేత దాని శక్తిని తగ్గించడానికి మరి రెండు మూడు బీజాక్షరములను సంపుటీకారణము చేసి మంత్రమును ఇచ్చెదరు.
రామ మంత్రమునకు బీజము రాం. అదే తారకము, వాల్మీకి, మారుతి జపించినది  ఈ బీజాక్షరమునే. మహా శక్తివంతమైనది ఈ రాం బీజము. అతి గుహ్యమైనది. ఉపదేశము లేకుండా బీజాక్షరములు చేయకూడదు. తట్టుకొనే శక్తి లేకపోతే ప్రమాదము. Mind un balance అవుతుంది. అంతర్లీనంగా శ్రీ రామ రక్షా స్తోత్రములో గలదు. సాధన చేత, ఉపాసన చేత, గురువుల అనుగ్రహము చేత దీనిని దర్శించ వలెను.

౩ మంత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ స్తోత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ భేదముందా?

దేనికి దానికి వేరుగా వుంటాయి. మంత్ర మంత్రమునకు ఇవి మారుతూ వుంటాయి. అలాగే స్తోత్రమునకు కూడా. అవి వేరు ఇవి వేరు.

౪ మంత్రాలలో కూడా మంత్రమనీ, మహామంత్రమనీ, మాలామంత్రమనీ ... ఈ భేదాలేమిటి?

అన్నింటినీ మంత్రములు అని అందురు. 24 అక్షరముల కంటే ఎక్కువ వున్న మంత్రములను, మరియు మోక్ష మంత్రములను ...మహా మంత్రములు అని అందురు.
మాలా మంత్రము అంటే కొన్ని వాఖ్యములు కోన సాగే మంత్రములను మాలా మంత్రములు అని అందురు. దండలాగా వుంటుంది. దీనికి ఉదాహరణలు నేను తరువాత చెబుతాను. ప్రత్యన్గిరా, చండీ, బగళ మంత్రములకు ఇలా మాలా మంత్రములు గలవు.

౫ మీరు చెప్పిన దుర్గాచండీమహామంత్రమంటే దుర్గాసప్తశతి అనా?

దుర్గా చండీ సప్తశతి యొక్క మూల మంత్రము చండీ మంత్రము అని అందురు. దీనినే కొంత సంపుటీకరణముతో, బేధముతో మహా చండీ కూడా గలదు.
చండీ మంత్ర ఉపదేశము లేనిదే చండీ సప్తశతి, (దుర్గా సప్తశతి) చేయకూడదు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి యొక్క త్రిశక్తి స్వరూపమే చండీ స్వరూపము.

౬ నాదబిందుకళలంటారు. అవేమిటి?

ఇది శ్రీవిద్యలో చెప్పబడుతుంది. ఇతరులకు చెప్పకూడదు. గురు ముఖ:త తెల్సుకోవలెను. కొన్ని విషయములను బహిరంగముగా చెప్పకూడదు. చాలా ప్రమాదము. సరిగా అర్ధము చేసుకోలేరు. భావన తప్పు వస్తుంది. ముందు నాదం అర్ధం చేసుకో. అవతల వాటి కళలు గురించి తెలుసుకొనేదవూ. ప్రకృతిని ఆరాధించడం తెలుసుకో. ప్రకృతిని అధ్యయనం చేయి.

మంత్ర శాస్త్రములో కొన్ని విషయములను ఎవరకి వారు సాధన ద్వారా తెలుసుకోవలెను. ఇతరులు చెబితే అర్ధము గాదు. మెలుకవులు గురువులు చెప్పుదురు.
దారి గురువులు చూపించేదారు, నడవ వలసినది మనము. మనము వెళ్లి తెలుసుకోవాలి.

మీ
శ్రీ భాస్కరానంద నాథ
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరులు..

Monday 15 August 2016

శ్రీవిద్యోపాసకులు

శ్రీవిద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వుంటారు. వ్యక్తిగత పగలు ద్వేషాలు తెలియవు వారికి. సమస్త ప్రాణి కోటిని అష్టావర్ష భవేత్ అన్నట్లుగా 80 ఏండ్ల ముసలి వాళ్లు కూడా 8 ఏండ్ల బాలికామణిలాగ కనిపిస్తూ వుంటుంది. అదే శ్రీవిద్యోపాసన....నరనరాలలో అమ్మ తనం నిండిపోయివుంటుంది...జగన్మాత లాగ మాట్లాడుతూ వుంటారు.....ప్రపంచంలో వున్న కుళ్లు కుతంత్రాలను చూసి బాధపడుతూ వుంటారు, ఓక్కోసారి ఆనంద తాండవం చేస్తూ వుంటారు....కడు విచిత్రంగా ప్రవర్తిస్తూవుంటారు....మన భావనలకు అందరు...ఎవ్వరినీ గుర్తు పెట్టుకొని పగ సాధించడం అనేది అసలు వుండదు, అహంకారం వుండదు.
ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన చేయలేరు.....ఎవరిలో ఈ దుర్గుణములు వుంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు.....తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు....గురుపరంపరకు మచ్చ రానీయరు.  సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురు దేవుళ్లు, గురు త్రయం కాపాడుతూ వస్తుంది....చేసిన పొరబాట్లను గురించి తక్షణమే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూవుంటాయి.
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరుల యోక్క మానసిక స్థితి కడు బిన్నముగా వుంటుంది...వారు అన్న ప్రతి మాటకూ ఓక అర్థం వుంటుంది....అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి ...అది ఆమే భాధ్యత.
వీరు అహంకారంతో, ఆగ్రహంతో ఏప్పుడూ మాట్లాడరు.....అయితే అలా కనిపిస్తూ వుంటారు కారణం వారి వెనుక శ్రీ భవానీ వున్నది అని నమ్మకంతో....వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఓడిలో పడుకొని నిద్రపోతారు....పూర్ణవిద్యాపరులు అంటే సాక్షాత్తు స్వయం కామాక్షీ స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ వుంటారు,  కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి...
అహం భావయే భవానీం....అని ఊపిరి పీలుస్తూ వుంటారు....అటువంటి భవానీ స్వరూపమునకు కొందరిమీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం వుండదు....శ్రీవిద్యోపాసకులతో మాటలాడే వ్యక్తుల యోక్క భావనలు తమంతట తాముగా బయట పడుతాయి....అందుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి....ప్రకృతిని శాసించే మంత్ర శక్తులు వీరి దగ్గర ఎక్కువగా వుంటాయి.....వీరి శరీరం మంత్రపూరితం అయ్యి వుంటుంది, పైకి అతి సాధారణముగా కనిపించినా లోన అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదామ్యత చెంది అణుసంధానమై వుంటారు...అందుకే తమలో తాము నవ్వుకొంటూ వుంటారు....నీవు పొగడినా, తిట్టినా ఒక్కటే విధముగా నవ్వుతూ వుంటారు.
చిన్న పిల్లల మనస్త్వత్వంతో ఆడుతూ పాడుతూ వుంటారు.....
కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు, తమ పుణ్యం కూడా ఆఖరాకి తమ ప్రాణాలు సహితం ధారపోస్తారు.....అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారి ప్రాణాలు తీయరు. కారణం అమ్మ ప్రాణ స్వరూపిణి, మాతృ స్వరూపిణి ....ప్రాణాలు ఇవ్వడమే వీరి లక్ష్యం.....పూర్ణ దీక్షాపరులైన శ్రీవిద్యోపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తూ వుంటారు....ఇటువంటి వారికి ఓక్కపూట భోజనం పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది....
శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను,  ముక్కోటి దేవతలను త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామకామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క.....
సాక్షాత్తు శ్రీదేవీ స్వరూపమైన శ్రీవిద్యోపాసకులు ఓక్క వారి గురువలకు తప్పించి లోకంలో మరెవ్వరి పాదములకూ నమస్కరించరు.....ప్రతి ప్రాణిలోనూ మాతృ భావన చేసి, మాతృ మూర్తిగా దర్శిస్తూవుంటారు.....వీరి శరీరభాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ వుంటుంది...అదే శ్రీవిద్యోపాసన.
చాలా చాలా కష్టమైన విద్య.......నిలుపుకోవడం చాలా కష్టం..

వీరు ఏవ్వరి దగ్గర నుంచీ ఏమీ ఆశించరు....వీరికి కావలసిన వన్నీ అమ్మ సమకూర్చి పెడుతూ వుంటుంది...నోటిలోమాట నోటిలో వుండగానే సకలాభీష్ఠదాయిని తధాస్తు ..అని అంటుంది.
వీరు కదులుతూ వుంటే అమ్మ వారు కదులుతూ వుంటుంది....ఆర్తి వీరి కళ్ళల్లో,  మాటలలో కనిపిస్తూ వుంటుంది. అమ్మతనం వీరి చేతలలో కనిపిస్తూ వుంటుంది.

పాదుకాంత పూర్ణదీక్షాపరులుగా వున్న వారిని మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును....పూర్వ జన్మ సుకృతం, పుణ్యఫలం, గురువుల అనుగ్రహం లేకపోతే పూర్ణదీక్ష రాదు....వచ్చినా నిలబడదు...
ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య....
అటువంటి మహా యజ్ఞమును చేస్తున్న మహా పురుషులకు నమస్కరిస్తూ....

Sunday 12 June 2016

ఆధ్యాత్మికత - ధార్మికత

ఆధ్యాత్మికత - ధార్మికత
ఓ ధార్మికుడు ఎప్పుడూ నీతి, నిజాయతీలను, ఆధ్యాత్మికతను వదలిపెట్టడు. నీతి బాహ్యమైన జీవితం గడిపేవారికి పవిత్రత అంటే పట్టదు, అనేక తప్పులు చేసి మొద్దుబారిపోతాడు. అలా సున్నితత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారిలో నైతికత్వం  నాశనం అవ్వడమే కాకుండా సిగ్గులేకుండా ప్రవర్తిస్తుంటారు. నైతిక విలువలకు నిజమైన సాధకుడు, ధార్మికుడు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడు.

అటువంటి సున్నితమైన మనస్సు లేకపోతే పారమార్థిక జీవనం గడపలేము. హృదయ పవిత్రతనూ, ఆధ్యాత్మికతనూ విడదీయలేము. ఓ పవిత్రమైన మనస్సు మాత్రమే పరమాత్మను గురించి నిరాటంకంగా ఆలోచించగలదు, ధ్యానించగలదు. మరి పవిత్రమైన మనస్సు రావాలంటే ధార్మికమైన జీవనం రావాలి ...అది రావాలంటే తెలుసుకోవాలి ...తెలుసుకొని నడుచుకోవాలి ..అప్పుడు రాక్షసత్వం నశిస్తుంది ..దానికి ఆహార శుద్ధి వుండాలి ....ఆహార శుద్ధి అంటే అన్నం శుద్ధి, శాఖాహారం అని కాదు...ఇంద్రియములకు ఇచ్చే ఆహారం ....ఆహార శుద్ధి వలన ఇంద్రియ శుద్ధి, తద్వారా సత్వగుణములు ఏర్పడుతాయి. ఇంద్రియములకు పవిత్రమైన విషయములనే ఆహారంగా ఇవ్వాలి.

ఆహారశుద్ధౌ సత్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః
స్మృతిలమ్భే సర్వగ్రంథీనాం విప్రమోక్షః ....(ఛాందోగ్యోపనిషత్తు)

పవిత్రమైన ఆలోచనలు ద్వారా పుణ్యాన్ని గడించి పాప పరిహారం చేసుకోవాలి. ఆహారవిహారముల పట్ల చాలా జాగురూకత వుండాలి. జ్ఞాన, భక్తి, కర్మ మార్గములలో నైతికత చాలా అవసరం. పవిత్రత లేకుండా ఏ మార్గములోనైనా సరే ముందుకు సాగలేము ...శారీరికంగా, మానసికంగా, ఇంద్రియపరంగా పరిశుద్ధంగా పవిత్రంగా వున్నప్పుడే నైతిక విలువలను సాధించగలము ...నైతిక విలువలను, ధార్మిక విలువలను కాపాడుకొన్నప్పుడే సమాజాన్ని రక్షించుకోగలం. సమాజాన్ని మార్చాలంటే ధార్మికంగా బ్రతకాలి ...ప్రతి ఓక్కరికీ ధార్మిక విలువలను బోధించాలి, ఆచరింపజేయాలి ...ధార్మక విలువలు అంటే ఏదో ఓక మతం గురించి, ఓ దేవుడ్ని గురించి చెప్పేది కాదు...

పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రములలో 1. యమ (సాధారణమైనవి) ,2 నియమ (నిర్ధిష్టమైనవి)... అని ముఖ్యంగా చెప్పి వున్నారు ...ఇవి ప్రతి ఓక్కరూ తెలుసుకొని ఆచరించాలి.
మనస్సును శాంతపరచాలంటే పవిత్రత ఎంతో అవసరం ...పరిపూర్ణమైన, యోగ్యమైన, పవిత్రమైన ఆలోచనలే మనస్సుకు ప్రశాంతిని ఇస్తాయి ...ఆ నిర్మలత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి, అందరికీ నేర్పించాలి ...రుద్ది రుద్ది ఇనుప ముక్కను అయస్కాంతం చేసినట్లుగా ...చెప్పి చెప్పి చెప్పి మనిషి యొక్క గుణములను మార్చాలి.....ఎందుకంటే అలవాటు పడిన రుచులు, పూర్వ వాసనలు అంత తేలికగా మనల్ని వదలిపెట్టవు ....కావున మనషిలో ఆధ్యాత్మికత ను పెంపొందించాలి, మనిషిలో చైతన్యం కలిగించాలి ....

ఆధ్యాత్మికత లో నిజంగా పరిపక్వత పొందిన వారు తప్పు చేయలేరు, వారికి ఇతరులకన్నా బాధ్యత ఎక్కువగా వుంటుంది. ఓ అనాగరికుడిలా ఓ సంస్కారవంతుడు ప్రవర్తించలేడు. ఆధ్యాత్మికత లో వున్న వారు చిన్న తప్పు చేయాలన్నా వెయ్యి సార్లు ఆలోచిస్తాడు, రాజీపడలేడు. తప్పు తెలుసుకొని ఓప్పుకోవాలి కానీ సమర్థించుకోకూడదు ...మనసు పరిపక్వత చెందడానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరం ...పరిపక్వత చెందిన మనసు సూక్ష్మతను పొంది ఆలోచనా స్థాయిలోనే చెడును అరికట్టగలదు .....ఆధ్యాత్మిక జీవనంలో పనులకంటే ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు సాధకుడు ....ఆలోచనా రూపంలోనే చెడును నిర్మూలిస్తాడు ...నైతిక విలువలను పాటించడం అంటే త్రికరణ శుద్ధిగా పాటించడం అని అర్ధం .....నైతికత అంటే చెడు పని చేయకపోవడమే కాదు చెడుకు కారణభూతం కూడా కాకూడదు అని శాస్త్రం మనకు చెబుతుంది ...చెడును ఆమోదించకూడదు.
ఓ సాధకుడు తను చెడు చేయకుండా, తన వల్ల చెడు జరగకుండా, చెడును ఆమోదించకుండా, చెడు ద్వారా లాభాన్ని ఆశించకుండా, పొందకుండా మసలుకొంటాడు ....ప్రలోభాలను తన దరిజేరనివ్వడు.
నైతిక జీవనం ఆధ్యాత్మిక జీవనానికి దారి తీయాలి...ఓ సాధకుడు, ఉపాసకుడు తనను తాను నిత్యం పరీక్షించుకొంటూ ముందుకు సాగుతూ వుంటాడు.... ఓ ఉపాసకుడు తన జప తప ధ్యానముల ద్వారా, సూక్ష్మ శక్తి ద్వారా తన చుట్టూ వున్న వాతావరణాన్ని, ప్రపంచాన్ని మారుస్తూ వుంటాడు, తద్వారా మనుషులలో వున్న అసురీ గుణములను పోగొట్టుతూ సమాజానికి తనవంతు కృషి చేస్తూ వుంటాడు ....సాత్వికమైన తరంగములను సృష్టిస్తూ వుంటాడు ...

నైతిక విలువలను ప్రతి మనిషిలో చైతన్యపరచి సమాజాన్ని కాపాడుకొందాం.... స్వస్తి.
.........ఆచార్య భాస్కరానంద నాథ/11-6-2016

Thursday 17 March 2016

ఉమ్మడి కుటుంబం

భార్య తప్పు చేస్తే భర్తని తప్పు బడతారు, భర్తకి చెడ్డ పేరు....
అలాగే బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులను,
ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని,
మగ పిల్లవాడు తప్పుజేస్తే తండ్రిని,
శిష్యుడు తప్పుజేస్తే గురువును,
ప్రజలు తప్పు జేస్తే రాజును నింద జేస్తారు....వాళ్ల ఖాతాలో ఈ పాపాన్ని వేస్తారు...
రాజు సరిగా పరిపాలించలేదని, గురువు శిష్యునికి మంచి బుద్దులు నేర్పలేదని,
తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పలేదని లోకం అంటుంది....ధర్మం కూడా అదే చెబుతుంది....
బిడ్డలకు విద్యా బుద్ధులతో బాటు మంచి సంస్కారం ఇవ్వకపోతే....ఆ పాపం ఎవరిది?
మంచి నడవడిక ఇవ్వలేదు, కొడుకు కోడలను బాగా చూసుకోలేదు, భార్యను వదిలేసినాడు,
తప్పు ఎవరిది?
లోకం ఎవరిని అంటుంది.....పిల్లలకు మంచి విషయాలు చెప్పాలా? పల్లేదా?
పట్టించుకోవాలా? పల్లేదా?
మనం మంచి నడవడిక నేర్పనందువలన, భార్య విలువ తెలియనందు వలన కొడుకు కోడలను వదిలేసినాడు.....తప్పు ఎవరిది? ఆ పాపం ఎవరిది?
కొడుకు ఆవేశం అణుచుకోలేక తప్పు జేసి జైలుకు వెళ్లాడు ....ఆ తప్పు ఎవరిది?
ఆ కొడుకును ఎప్పటికప్పుడు సరియైన శిక్షణలో పెంచకుండా వదిలివేసిన ఆ తల్లిదండ్రులది పాపం.....గారాబం....మొండితనం.....చెప్పిన మాట వినకుండా పోవడం....
మన కంటి ముందే మన పిల్లవాడు పాడైపోయినాడు, చెడిపోయినాడు......తప్పు ఎవరిది?
ఎంత మంది మగ వాళ్లు తమ భార్యలను ఏడిపించుకొని తింటున్నారో తెలుసా?
ఎంత మంది కూతుళ్లు కోడళ్లు అయ్యి అత్తమామలను వేధిస్తున్నారో తెలుసా?

ఇది మనం మన పిల్లలను సక్రమంగా పెంచకపోవడం వలనే కదా?

కొంత మంది మిత్రులు చెబుతున్నారు....పిల్లలను తప్పు బట్టకూడదని, కొంత వయసు వచ్చిన తరువాత వాళ్ల విషయాలలో పట్టించుకోకూడదని...వాళ్ల దగ్గర నుంచి మనం ఏదీ ఆశించకూడదని...వాళ్ల మీద ఆధారపడకూడదని, విడిగా వుండాలని, దూరంగా వుండాలని, అంటీ అంటనట్లు వుండాలని................ఇది తప్పు.

వాళ్ల దైనందిక విషయలలో మనం పట్టించుకోకూడదు గానీ, వాళ్ల తప్పు ఓప్పుల గురించి పట్టించుకోవాలి....మంచి చెడ్డలు గురించి చెప్పాలి.... దాన దర్మములను గురించి, పాప పుణ్యములను గురించి పదే పదే చెప్పాలి....మంచి నడవడికను, సంస్కారాన్ని నేర్పించాలి.

మనం చెప్పక, వాళ్లు తెలుసుకొనక తప్పుచేసి, పాపం చేసి శిక్ష అనుభవిస్తూ వుంటే, నిజంగా ఆ శిక్ష ఎవరికి? తండ్రిగా చూస్తూ వుండగలవా? ఆ శిక్ష నీకు వేసినట్లు....పిల్లలు బాధపడుతూ వుంటే అది చూసి ఏడవమని భగవంతుడు నీకు వేసిన శిక్ష అది....

ఉదాహరణకు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పలేదు, జోక్యం చేసుకోలేదు....చివరికి తన ముందే కొడుకు మరణించాడు....ఆ క్షోభ ఎవరికి?

ధ్రౌపది విషయంలో భీష్మడు వారించకుండా, మిన్నకుండా చూస్తూ వుండిపోయినాడు, శిక్ష అనుభవించినాడు....ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భీష్మునికి చెబుతాడు....

ధర్మం తప్పినట్లు అవుతుంది తండ్రిగా వారించకపోతే,  చెప్పకపోతే.....

కొడుకు చేసిన పాపం తండ్రిగా నీవు అనుభవించాలి....
కొడుకుకు మంచి చెడు చెప్పి, కొడుకు చేత ధర్మకార్యములు చేయించే భాద్యత నీదే....

పెళ్లి చేసేశాను నా భాధ్యత అయిపోయింది అనుకొంటే కుదరదు....మనవడు పుట్టేదాక భాధ్యత వుంది, చివరి వరకు కొడుకును తీర్చిదిద్ద వలసిన భాధ్యత తల్లిదండ్రుల మీద వున్నది...

తల్లిదండ్రులను చూడవలసిన భాధ్యత కొడుకు కోడలు మీద వున్నది....పిల్లల దగ్గరనే పెద్దలు వుండి ఆ పుణ్యాన్ని పిల్లలకు కట్టబెట్టే భాధ్యత కూడా తల్లిదండ్రుల మీద వున్నది....మన పురాణాలలో ఇదే చెప్పబడి వున్నది....ఇదే శాస్త్ర వచనం....ఇది నా వచనం కాదు...

శిష్యుడ్ని గురువు డండించక పోతే ఎలాగ? నాకెందుకులే అని ఊరకుండితే ఎలాగ? గురువులు వచ్చి నిలదీస్తే రాముల వారు పరిగెత్తినారు, శ్రీ కృష్ణుడు పరుగెత్తినాడు....

ఆఖరాకి భగవంతుడు భక్తుని నుంచి భక్తి కోరుకొంటున్నాడు....except చేస్తున్నాడు..
భక్తుడు పూజ చేసి పుణ్యాన్ని అడుగుతున్నాడు, మోక్షాన్ని అడుగుతున్నాడు.....
ఎదుటి వారి నుంచి మనం ఏదీ ఆశించకూడదు అంటే ఎలాగ? అది ఇతరుల వద్ద సరే బాగుంటుంది.....పిల్లల దగ్గర కుదరదు.....పిల్లల దగ్గర మనం ఆశించాలి, అప్పుడే మన ఋణం, వాళ్ల ఋణం తీరుతుంది....పిల్లల ప్రేమను ఆశించాలి, వాళ్లు మనకు సేవ చేయాలి, మనల్ని బాగా చూడాలి, అది వాళ్ల విధి....ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకుండా నీవు నీ అంతట వేరుగా వుంటే వాళ్లకు పుణ్యం ఎలా వస్తుంది? తల్లిదండ్రులకు సేవ చేసినాడు అనే పుణ్యం ఎలా వస్తుంది? చేయలేదు, చూడలేదు అనే పాపం వాళ్ల ఖాతాలో పడుతుంది నీవలన ...

అన్యం పుణ్యం ఎరుగని భార్యను,  భర్త ఉత్త పుణ్యానికి వదిలేసి భరణం ఇస్తాను అంటే ఎలా సరపోతుంది....ఎవరి లెక్కన వేయాలి ఈ పాపం....ప్రేమగా చూడాలా పల్లేదా? అనుబంధం ఎక్కడి నుంచి వస్తుంది....కొంత మంది తల్లిదండ్రులు కొడుకుకు మంచి చెప్పకుండా కోడలను తరిమేసి ఆనందిస్తున్నారు.....తప్పు ఎవరి లెక్కలో వేయాలి....సంసారాన్ని చక్కదిద్దాల్సిన భాధ్యత తల్లిదండ్రుల మీద లేదా? జోక్యం చేసుకోకూడదు అంటే ఎలాగ? ఆ అమ్మాయి బ్రతుకు ఎమి కావాలి? కొడుకును నాలుగు తన్ని పో పో పోయి కోడలను పిల్చుకొనిరా అనాలి...
అలాంటి పనికిమాలిన తల్లిదండ్రులు లోకంలో వున్నారు.....మనకెందులే తలదూర్చకూడదని.

దయచేసి విదేశీ సంస్కృతిని ఇక్కడకు తీసుకొని రావద్దండి.....మనది వసుధైక కుటుంబం ...వారసత్వ కుటుంబం....ఉమ్మడి కుటుంబం....
అమ్మా, నాన్నలతో, తాతయ్య, బామ్మలతో పెరిగే కుటుంబం.....అత్తా- మామలతో ఆడుకొనే కుటుంబం....బంధువులతో, స్నేహితులతో, ప్రేమానురాగాలతో ఓలలాడే కుటుంబం మనది....

ఓంటరి కుటుంబం కాదు....nuclear family కాదు.....
.......భాస్కరానంద నాథ/15-03-2016