Thursday 25 July 2013

విభూతి మహిమ

ధర్మదేవుడు శాపము నొందుట
ఒకప్పుడు అత్రి పుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపము చేసెను. పదివేలయేండ్లు గడచినవి. ధర్మదేవత (యముడు కాడు) ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపము వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. అప్పుడాయన ప్రత్యక్షమై " నీవంటి కోపిష్టి వానికి తపస్సు ఫలించునా? అనగా దూర్వాసుడు "నీ వెవ్వడ" వాణి యడిగెను. ధర్ముడు "నేను ధర్మమూర్తి" ననెను. దూర్వాసుడు మహాక్రోధముతో "నా కోపమును నీ వర్పగాలవా? పదివేలేండ్లు గడచిన తరువాత ఇప్పుడు మేము కనబదితిమా? ఇన్నాళ్ళు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైననూ నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైనట్లు కనబడుచున్నది.నీవు ఇంత దుర్మదాందుడవై బ్రహ్మణాపచారము ఒక రాజువై, ఒక చండాలుడవై పుట్టుము. " అని శపించి లేచిపోయెను. ఆ శాపమువలన విదురుడుగాను, పాండుకుమారులలో జ్యేష్టుడైన ధర్మరాజుగాను, కాటికాపరి తనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించెను.   .........పద్మ పురాణము

సీతాదేవికి చిలుక శాపము   
అది మిథిలా నగరములోని అంతః పురస్త్రీల ఉద్యానవనము. సేతాదేవి చెలికత్తెలతో విహారమునకు వచ్చెను. ఒక చెట్టుమీద చిలుకల జంట ముచ్చట లాడుకొనుచుండెను. అవి వాల్మీకి ఆశ్రమమునుండి వచ్చినవి. మగచిలుక, " ఈ దేశపు రాజుగారి కే సీత నాగటిచాలులో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగము చేసి పెండ్లాడునట" అని భార్యకు చెప్పుచుండెను. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను బట్టి తెప్పించెను. వానితో సీత, "మీరెవరిని గురించి మాట్లాడుతున్నారు ? సీతను నేనే. నన్ను గురించియేనా? ఆ రాముడెవడో చెప్పుడు. ఈ సంగతులు మీ కెట్లు తెలిసినవి. "అని అడుగగా "మేము వాల్మీకి ఆశ్రమములోని వారము. విహారమునకై వచ్చినాము. వాల్మీకి ముని రామాయణము అని ఒక గ్రంథము వ్రాయుచున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు" అని శుకములు చెప్పి, తమ్ము వదలమని ప్రార్ధించెను. " ఆ శుభకార్యము జరిగిన తరువాత్ అమిమ్ము విడిచెద" నని సీత యనెను. అవి "మేము స్వేచ్చగా తిరిగేది వారము. పంజరములలో ఉండలేము అదియునుగాక  నాభార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయతో విడిచిపెట్టు" మని కోరెను. సీత, "అయినచో ప్రసవ మగునంతవరకు ఆడచిలుక నాయొద్దనే యుండును. నీవు పొమ్మని" మగ చిలుకను విడిచెను. అది, "తల్లీ, దీనిని విడిచి నేను బ్రతుకలేను. కరుణించి మమ్మిద్దరిని విడిచిపెట్టు" మని దీనముగా ప్రార్ధించెను. కాని సీత వినలేదు. ఆడచిలుక, సీతతో నాభర్త నన్ను విడిచి బ్రతుకలే ననుచున్నాడు. నేనునూ అతనిని విడిచి బ్రతుకలేను. కావున మమ్ము దయజూడు మనెను. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడచిలుక గుండెలు పగులగొట్టగా అది సీతను జూచి "యింత కటినురాలవై గర్భవతియైన నన్ను నాభర్తనుండి విడదీసినావు కావున, నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడెదవు". అని శపించి ప్రాణము విడిచెను. మగచిలుక " నాభార్యను అన్యాయముగా చంపినావు. కావున నిన్ను నీ భర్త విడచుటకు మూలకారణుడైన చాకలివాడనై జన్మించి పగ తీర్చుకొందు" ననుచూ వెళ్ళి గంగానదిలో పడి మరణించెను.
సీతను రాముడు అడవిలో విడుచుటకు ఇదియే కారణము ..................పద్మ పురాణము
 విభూతి మహిమ
 
 
కైలాసము నుండి శంకరుడు విప్రవేషముతో నొకనాడు రామునొద్దకు వచ్చెను. రాముడు " తమ నామమును, నివాసమును చెప్పు డనగా ఆయన నాపేరు శంభుడు, కైలాసము నా నివాసము" అనగా అతనిని శంకరుడుగా గ్రహించి రాముడు విభూతి మహిమను చెప్పుడని యడిగెను. శివుడు చెప్పసాగెను.

"రామా! భస్మ మహత్యము చెప్పుటకు బ్రహ్మాదులకు గూడ శక్యము గాదు. బట్ట మీది చారలను అగ్ని కాల్చినట్లు, మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను గూడ తుడిచివేయు శక్తి భస్మమునకు ఉన్నది. విభూతిని మూడు రేకలుగా పెట్టుకోన్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లు అగును.

ముఖమున భస్మమమును ధరించిన నోటి పాపములు (తిట్టుట - అభక్ష్యములను దినుట అను పాపములు), చేతుల పైన ధరించిన చేతిపాపములు (కొట్టుట మొ||) హృదయము పై ధరించిన మనః పాతకములను (దురాలోచనలు మొ||), నాభి స్థానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భార్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది గాన భస్మము అను పేరు దీనికి పేరు గలిగెను.

భస్మముమీద పండుకొన్నను, తిన్నను, ఒడలికి పూసికొన్నను పాపములు భస్మీభూతము లగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము గలిగించును. సర్పవృశ్చికాది విషములను హరించును. భూత పిశాచాదులను పారద్రోలును.

వశిష్ట వంశములో ధనంజయుడు అను విప్రుడు గలడు. అతనికి వందమంది భార్యలు, వందమంది కొడుకులు. వారికి తన దానములను సమానముగా పంచి యిచ్చి ఆ విప్రుడు గతించెను. కొడుకులు అసూయతోను, దురాశాతోను ఒక ధనముల కొకరాశపడుచు తన్ను కొనసాగిరి. వారిలో కరుణుడను కొడుకు, శత్రు విజయము సాధించ వలెనని గంగాతీరమున కేగి  స్నామాది తపము చేయవలెననుకొని మునుల సేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మ పండు దెచ్చి అక్కడ పెట్టెను. దానిని వీడు వాసన చూచెను. అందుకు మునులాగ్రహించి ఈగవై పొమ్మని శపించిరి. వీడు వేడుకొనగా పూర్వస్మృతి నిచ్చిరి. అంతట ఏడ్చుచూ వెళ్లి భార్యతో చెప్పెను. ఆమె పతివ్రత. చాల విచారించెను. ఒకనాడీ సంగతి తెలిసిన వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమున్ ఉ తీసికొని అరుంధతి దగ్గరకు బోయి ప్రార్ధింపగా ఆమె, మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని జల్లి, కరుణుని బ్రతికించెను.
.
​....​..................పద్మ పురాణము

--
మీ
శ్రీ భాస్కరానంద నాథ
 


Saturday 2 March 2013

శ్రీవిద్యా గురుకులం

 శ్రీవిద్యా గురుకులం - అమ్మ గురుకులం .

 నమ్మకం లేని భక్తీ, ఏకాగ్రత లేని ధ్యానం, గురువు లేని విద్య ఎప్పటికీ రాణించదు.

ఇది అమ్మ ఓడి. పసి పాపలమై అమ్మ ఓడి లో పడుకొంటాము. అమ్మ కొంగుతో ఆడుకొంటాము. అమ్మ పిలుస్తుంది రండి, అమృతము అనే అమ్మ ప్రేమను మన మందరము పొందుతాము. ఇది మన బడి, అమ్మ గురుకులం, మన అందరికీ అమ్మ శ్రీవిద్య నేర్పిస్తుంది.
అమ్మలగన్నయమ్మ పెద్దమ్మ ఓడి లో హాయిగా మనమందరమూ ఆడుకొంటాము.
ప్రేమ, త్యాగం, పరోపకారం, నిస్వార్ధ సేవ  దీని ప్రధాన ఉద్దేశ్యము. 
ఎటువంటి లాభాపేక్ష లేని గురుకులం, ఇది మన అందరిది, రండి చేరండి, అమ్మను గురించి తెలుసుకోండి. అమ్మను చూడండి.
అమ్మ ప్రేమ స్వరూపము. ఆనంద స్వరూపము. అన్ని సమస్యలకు అమ్మే దిక్కు. అమ్మే పరిష్కారము చూపుతుంది.
అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
జ్ఞాన జ్యోతి వైపుకు నడవాలనే వారి అందరికీ ఇదే మా ఆహ్వానము.
రండి  చేతులు కలపండి, అందరమూ కలిసి శ్రీచక్ర నగరమైన మణి ద్వీపము నకు వెళదాము.

ఆహ్వానము
సనాతన ధర్మమును నమ్మి,విశ్వసించి, ఆచరించే వాళ్ళు, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మేవాళ్ళు, దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళు, బొట్టు పెట్టుకొనే వాళ్ళు, వేదమును మన పురాణములను గాఢంగా నమ్మేవాళ్ళు, ఆది శంకరులు శ్రీ శంకర భగవత్పాదుల సిద్దాంతమును నమ్మేవారు, అద్వైత సిద్దాంతమును నమ్మి ఆచరించే వారు, పెద్దలను, గురువులను గౌరవించే వారు, మన హైందవ సంస్కృతికి గౌరవము ఇచ్చి, ఆచరించే వాళ్ళు, మన మాతృ భాష తెలుగును గౌరవించే వాళ్ళు, శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాచారము మీద నమ్మకము వుంచి, పంచాయతనమును నమ్మి కొలిచే వాళ్ళు, దేవుడి మీద నమ్మకము వున్న వాళ్ళు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల మీద నమ్మకము వున్న వాళ్ళు, వేద, శ్రుతి, పురాణ వాంగ్మయమును భక్తితో నమ్మి కొలిచే వాళ్ళు, ధర్మాచరణ కలిగిన వాళ్ళు, హైందవ సంస్కృతికి అద్దం పట్టే వాళ్ళు, ఆది దంపతులను, శ్రీ సీతారాములను, శ్రీలక్ష్మీ నారాయణులను, శ్రీ వేంకటేశ్వరులను, ఇలవేల్పులుగా, ఇష్ట దైవముగా కొలిచే వాళ్ళు, సత్యమును,ధర్మమును నమ్మి ఆచరించే వాళ్ళు,ఆచారకాండ,జ్ఞానకాండ యందు నమ్మకము, భక్తీ, ఆసక్తి వున్న వాళ్ళు,వాళ్ళు ఎవరైనా ఏ వర్ణము వారు అయినా ఈ సత్సంగమునకు ఆహ్వానితులే. వారు నిర్బయముగా సభ్యులుగా ఈ blog లో చేర వచ్చును.
నిత్య జీవితములోని, సంసారములోని అన్ని సమస్యలకు పరిష్కారము చూపుతూ, భగవంతుని తెలుసుకోవడమే దీని ఉద్దేశ్యము.
హైందవ సంస్కృతికి, సనాతన ధర్మమునకు, అద్దం పట్టే విషయములు, దైవిక సంబంధమైన, పూజ, అనుష్టానము, ఆచార వ్యవహారములు, కర్మకాండ, మంత్రానుష్టానములు, తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము,సమాధి, ... గృహస్థాశ్రమ ధర్మములు, వైవాహిక ధర్మములు,మొదలగు విషయములను గురించి చర్చిస్తూ, ఒకరికి తెలిసిన విషయములను మరొకరికి తెలుపు కొంటూ,ఆ పరమాత్మను, పరదేవతను చేరుకోవడమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యము.
హైందవ మతస్తులకు  మాత్రమే ఇందు ప్రవేశము. అమ్మ మీద నమ్మకము వున్న వాళ్ళు ఇందు చేర వచ్చును.

మీ
శ్రీ భాస్కరానంద నాథ

మహోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.



 

 

Wednesday 13 February 2013

శ్రీవిద్యా దీక్ష.

శ్రీవిద్యా దీక్ష.- నియమములు.

శ్రీవిద్యా దీక్ష కావాలని చాలా మంది అడుగుతూ వున్నారు. వారికందరికీ నా విన్నపము.

ఈ దీక్ష అమ్మ అనుగ్రహము లేనిదే రాదు. అమ్మ అనుగ్రహము మెండుగా వుండాలి. అమ్మ రాక కోసం ఎన్నో జన్మలు తపస్సు చేయాలి, కోటకలాడాలి, తపన చెందాలి, అప్పుడే అమ్మ శ్రీవిద్య రూపములో మనల్ని అనుగ్రహిస్తుంది. శ్రీవిద్య బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానమును తెలిపేది, తెలియబడేది. అన్నింటి కంటే ఉత్తమోత్తమైన విద్య ఇది. ఇది దొరకడం ఎంతో దుర్లభము.
శివ, విష్ణు సహస్ర నామములు కొన్ని వేల జన్మలయందు చేసిన వాడికి లలితా సహస్ర నామములు దొరుకుతుంది. లలితా సహస్ర నామములతో ఆ తల్లిని కొన్ని వేల జన్మల యందు కొలిచిన వాడికి ఈ శ్రీవిద్య దొరుకుతుంది. ఈ శ్రీవిద్య దొరికిన వాడికి అమ్మ అనుగ్రహము పూర్తిగా వుంటే అమ్మ శ్రీచక్ర రూపములో మన ఇంటికి వస్తుంది అని పెద్దలు చెబుతారు.
శ్రీవిద్య దొరకాలన్నా, శ్రీచక్రము రావాలన్నా అమ్మ అనుగ్రహము మన మీద మెండుగా వుండాలి. ప్రత్యేకముగా అమ్మ పెట్టె పరీక్షలు యందు తట్టుకొని నిలబడి ఉత్తీర్ణుడవు కావాలి. లేదా అమ్మ నిలబడదు. వెళ్లి పోతుంది. ఓక్క క్షణం వుండదు....
ఇది మిమ్మల్ని భయపెట్టటానికి కాదు, మిమ్మల్ని సంసిద్దుడ్ని చేయడానికి. రహస్యం, గోప్యం అని అనడంలోని ఉద్దేశ్యము చెప్ప కూడదు అని కాదు, దానిలోని తీవ్రతను మనకు తెలియ చేయడానికి పెద్దలు శాస్త్రములు అలా చెబుతాయి. అన్నింటికీ యోగ్యుడైన వ్యక్తి ఈ విద్యకు అర్హుడు.
అమ్మ రకరకాలుగా పరీక్షలు పెడుతుంది, దానికి తట్టుకొని, మాయకు లొంగ కుండా వుంటే అమ్మ నీ దగ్గర వుంటుంది, లేదంటే ఏదో ఒక కారణం చూపించి ఆమె వెళ్లి పోతుంది. ఒక్క క్షణం ఆమె నీ దగ్గర ఉండదు తప్పు చేస్తే....ఎన్నో పరీక్షలు చేసి చేసి నాకు పాదుకాంత పూర్ణదీక్ష ఇచ్చినారు....
మా గురు దేవుళ్ళు ఎన్నో తార్కాణములు మాకు చూపి వున్నారు. మరెన్నో నా జీవితములో నేను నా కళ్ళారా చూచినాను. ఈ విద్య కావాలనుకొనే వారికి అమ్మ ఒక్కోరికి ఒక్కో ప్రశ్నా పత్రం ఇస్త్తుంది. ఒక్కో రూపములో సమస్య ఎదురౌతుంది. అది ఎలా వుంటుంది అని మనము చెప్పలేము. ఎప్పుడైనా ఎవరికైనా ఏరూపములో నైనా అది రావచ్చును. ఎవరో మహానుభావులకు ప్రశ్న లేకుండానే విద్య వస్తుంది.
నూటికి 99 మందికి పరీక్ష వస్తుంది. రాత్రిళ్లు అమ్మ ఇంట్లో తిరుగుతుంది...భీకరాకారముతో అరుస్తుంది....ఓక్కోసారి ప్రేమగా పలుకరిస్తుంది....గజ్జెల శబ్ధం వినిపిస్తుంది ....
మన ప్రారబ్దం బాగుంటే అన్నీ సవ్యముగా జరుగుతాయి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏది జరిగినా అమ్మను వదలి పెట్టను అని గాఢమైన విశ్వాసము, ఆ తెగింపు నీలో వుంటే నీవు శ్రీ విద్యకు అర్హుడవు అవుతావు.....మోసం చేయకూడదు, స్త్రీలను భాధ పెట్టకూడదు....ఆడదాన్ని ఏడిపించకూడదు.....పరస్త్రీని కోరుకోకూడదు, వాంఛ వుండకూడదు, అందరిలో అమ్మవారిని చూడాలి.....పసిపిల్లగా కనిపించాలి....యవ్వనవతిగా నీకు కనిపించకూడదు....కలలో కూడా పరస్త్రీ వస్తే సంభోగ వాంఛ కలుగకూడదు.....నగ్నంగా వచ్చినా నీవు అమ్మా అని పిలువగలిగి వుండాలి...కామాన్ని నియంత్రించుకోవాలి.....తేడా వస్తే అంతే పిచ్చి బడుతుంది.....మనిషి ప్రాణాలకే ముప్పు ....అమ్మవారు కలలో, ఇలలో రకరకాల పరీక్షలకు గురి చేస్తుంది.....నిన్ను మోహిస్తూ ఓ ఆడది నవ యవ్వనవతి వస్తుంది, పరిచయం అవుతుంది, నిన్ను కోరుకొంటుంది......నీవు తిరస్కరించే పరిస్థితిలో వుండాలి......
లేదంటే హాయిగా లలితా సహస్ర నామములు చదువు కొంటూ అమ్మను పూజించు కోవచ్చును, మంత్ర శాస్త్రము జోలికి పోకుండా. శ్రీవిద్య అంతా మంత్ర శాస్త్రముతొ కూడినది.
పరీక్షలు ఒక్కోసారి నీ భార్య రూపములో, ఒక్కోసారి తల్లిదండ్రుల రూపములో, బిడ్డల రూపములో, గురువు రూపంలో, బంధువుల రూపములో ఏదో ఒక రూపములో వస్తుంది. అది పరీక్ష అని నీకు తెలిసే లోపలే అంతా జరిగి పోతుంది. నిల బడటం చాలా కష్టం. నిలబడినావా నీ జీవితం ధన్యం అవుతుంది.
ఉదాహారణకు నా జీవితములో ఎదురైన ఓ సమస్యను మచ్చుతునకగా చెబుతున్నాను. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అంత కంటే నా గొప్ప తనము చెప్పడానికి కాదు. మహానుభావులు, గొప్ప వాళ్ళు ఎందరో వున్నారు, వాళ్ళ ప్రాణాలు సహితం అమ్మ కోసం ఇచ్చి వేసినారు. అటువంటి వారి కాలి గోటికి కూడా నేను సరిపోను. ఈ శ్రివిద్యకోసం మా గురు దేవుళ్ళు తమ బిడ్డనే త్యాగం చేసు కొన్నారు. అటు వంటి వారి పాదములకు నమస్కరిస్తూ ..
నాకు మొదట మంత్రము ఇచ్చిన గురుదేవుళ్ళు ఆరునెలలు నన్ను త్రిప్పించి ఒక రోజు ముహూర్తము పెట్టించి, ఆ రోజు రమ్మని కబురు పెట్టినారు. చివరకి అదే రోజు ఎప్పుడో సంవత్సరము క్రిందట apply చేసిన ఉద్యోగము (విశాఖ ఉక్కు కర్మాగారములో), వ్రాత పరీక్ష పాస్ అయినావు interview కి రావలసినదిగా teligramm పంపినారు. అదే రోజు. ఇక చూడండి నా పరిస్థితి. రెండూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ వున్నాను. ఏది వదులు కోవడానికి మనస్సు ఇష్టపడుట లేదు. గురువు గారి దగ్గరకు వెళ్లి చెప్పినాను. ఆయిన " నాకు తెలియదు వస్తే రా లేకపోతే పో" .. అని కసురుకొన్నారు. ఏమి చేయాలో దిక్కు తోచలేదు. చివరకు ఒకటే అనుకొన్నాను అమ్మ అనుగ్రహము వుంటే అన్నీ ఉన్నట్లే అని అనుకోని ఆ రోజు interview కు పోకుండా గురువు గారి దగ్గరకు వెళ్లి శ్రివిద్యను తీసుకొన్నాను.
అలాగే ఇంకోసారి శ్రీచక్రము వచ్చిన క్రొత్తల్లో. విజయవాడ వాస్తవ్యులు యాబలూరి లోకనాధ శర్మ గారు (ప్రఖ్యాత శ్రీ విద్యోపాసకులు) వారింటికి మేము భార్యా భర్తలము వెళ్లినాము వారిని చూచి, వారి ఆశీర్వాదము తీసుకోవడానికి. వారికీ మేము తెలియము, మాకు వారు తెలియదు. మమ్మల్ని మా ఆర్తిని చూచి వారి పూజా మందిరములోనికి తీసుకెళ్ళి వారి ఇంట్లో పూజలో వుండే ఆరు అంగుళముల శ్రీచక్రము మా చేతులో పెట్టి, వెళ్లి అమ్మను పూజించుకోండి అని మమ్మల్ని ఆశీర్వదించినారు. అదే శ్రీ చక్రము ఇప్పుడు మా ఇంట్లో కొలువై వున్నది. ఆ తల్లి దయ వుంటే మనము ఎవరో తెలియక పోయినా ఎవరి రూపములోనో, ఏదో రూపములో మీ ఇంటికి వస్తుంది. అలా మా ఇంటికి వచ్చిన ఆ తల్లిని చాలా జాగ్రత్తగా కోలుచుకొంటూ దినములు గడుపుతున్నాము. ఇంతవరకు బాగున్నది.
ఆ తరువాతే పెద్ద సమస్య వచ్చి బడినది.
నా భార్యకు పెద్ద జబ్బు చేసినది. వాళ్ళ తల్లి దండ్రులు చాలా భయపడి పొయినారు. చిలికి చిలికి గాలి వాన అయినట్లు అది అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి శ్రీ చక్రము మీద పడినది. అప్పటి వరకు ఇటు మా వంశములో గానీ, వాళ్ళ వంశములో గానీ ఎవ్వరూ ఇలా శ్రీవిద్య తీసుకొని శ్రీ చక్రమును పూజించలేదు. ఎవ్వరికీ దీని విషయము పూర్తిగా తెలియదు. అమ్మో శ్రీ చక్రమే దానికి ఎంత మడి, దడి వుండాలి, ఎన్ని పూజలు చేయాలి, ఎంత అన్నం నైవేద్యం పెట్టాలి, చిన్న పిల్లలు మీ వళ్ళ అవుతుందా .. అని అలా చేయ కూడదు, అందుకే మీ అమ్మాయికి తీవ్రమైన జబ్బు చేసినది అని మా అత్తగారి వైపు బంధువులు వాళ్లతో అన్నారు.
ఇక అంతే మా అత్తగారు వాళ్ళు, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి పొయినారు. పంపించమంటే పంపించరు. ఇలా సంవత్సరము అయిపోయినది. నేను ఒక్కడ్నే ఏడుస్తూ అమ్మకు పూజలు చేస్తూ వచ్చాను. చివరకు నాకు వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు ఏమంటే వాళ్ళ అమ్మాయిని నా దగ్గరకు పంపించాలంటే శ్రీ చక్రమును ఇంట్లో నుంచి తీసేయాలని.
అంతే నాకు కళ్ళు భైర్లు క్రమ్మినవి. భూమి బ్రద్దలు అయినట్లు అనిపించినది. ఎన్నో రాత్రుళ్ళు శ్రీ చక్రము దగ్గర పెట్టుకొని ఒంటరిగా ఏడుస్తూ అలాగే నిద్ర పోయే వాడ్ని. అమ్మ దగ్గర ఏడ్చినాను. ఏమిటమ్మా ఈ పరీక్ష అని.
తల్లా ? పెళ్ళామా ? ఏది కావాలో తేల్చుకో అంటే నేను ఏమని చెప్పేది తల్లీ అని విల విలా ఏడ్చినాను, పెద్ద వాళ్ళ చేత చెప్పించినాను. అయినా మా అత్తగారు వాళ్ళు వినలేదు. ఇంటకి వచ్చి చూస్తే అమ్మ శ్రీ చక్ర రూపములో ఏడుస్తూ నాకు కనిపించేది. " ఏరా నీ భార్య కోసం నన్ను వదిలేస్తావా? అని పలికేది కలలో. ఎటూ తేల్చుకో లేక పోయే వాడ్ని. ఎవరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అప్పుడు మా నెల్లూరులో ఈ శ్రీవిద్య గురించి ఎవ్వరికీ బాగా తెలియదు, ఎవరి చేతనైనా చెప్పిస్తాము అని అనుకొంటే.
చివరికి ఒక్కటే నిర్ణయించుకొన్నాను, ఏది ఏమైనా సరే అమ్మను వదలి పెట్టకూడదు అని, శ్రీచక్రమును వదల కూడదు అని. "వదలను అమ్మా నిన్ను వదలను, నిన్ను వదలి నేను ఉండలేను, నాతో బాటే నీవు, నీవు లేకుండా నేను ఉండలేను తల్లీ అని మా వాళ్లకు తెగేసి చెప్పినాను.
నేను శ్రీచక్రమును తీయను అని. మీకు ఇష్టము వుంటే మీ అమ్మాయిని పంపించండి, లేకపోతే మీ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పి వచ్చాను.
లోపల బాధ వున్నా నా భార్య లేదని, మా అమ్మ నాతోనే వున్నది అన్న ఆనందముతో రోజులు గడుస్తున్నాయి. మరో ఆర్నెల్లు గడిచి పోయినాయి. నాది ఒంటరి బ్రతుకు అయిపోయినది. అయితే అమ్మ (శ్రీచక్రము) నా దగ్గర వున్నది. రోజూ శ్రీవిద్యా మంత్రములతో అమ్మను అర్చిన్చుకొంటూ వస్తున్నాను.
నేను నా భార్యను అమితముగా ప్రేమిస్తాను, తను లేకపోతే ఒక్క క్షణము ఉండలేని వాణ్ణి అయినా ఆ తల్లి కోసం బలవంతాన వున్నాను. ఏది ఏమైనా జరగనీ అని.
రోజూ ఆమెతో పోట్లాడేవాణ్ణి " ఊరికే కూర్చోకపోతే వెళ్లి నీ కోడలను పిల్చుకొని రారాదా" అని...
ఆమె నవ్వుతూ చూస్తూ వుంటుంది, పలుకదు, ఉలకదు...
 రోజులు గడిచి పోతున్నాయి. మా ఆవిడను వాళ్ళు పంపించ లేదు. వాళ్ళకు అతి భయము.
ఒక రోజు వాళ్ళ దూరపు బంధువు, పెద్ద ముసలాయన అనుకోకుండా వాళ్ళింటికి వచ్చి జరిగినదంతా విని, వాళ్ళను తగువు లాడి, శ్రీ చక్రమును గురించి, శ్రివిద్యను గురించి వాళ్ళకు చెప్పి, వాళ్ళ భయమును పోగొట్టి,
మీ అల్లుడు చాలా పుణ్యాత్ముడు, కారణజన్ముడు, మూలా నక్షత్రంలో పుట్టిన వాడు, దేవీ పుత్రుడు, అమ్మవారి అంశతో పుట్టినాడు అని వాళ్ళకు చెప్పి, వెంటనే మీ అమ్మాయిని అబ్బాయి దగ్గరకు పంపండి అని చెప్పి వెళ్ళినాడు.
ఏమి మాయో వాళ్ళు ఆయిన మాటకు గౌరవము వుంచి ప్రక్కరోజు తీసుకొని వచ్చి మా ఇంట్లో దిగబెట్టి వెళ్ళినారు. అంతా తమాషాగా జరిగి పోయినది. ఆ తరువాత ఎవ్వరూ ఏమీ అనలేదు శ్రీ చక్రము గురించి. ఇది జరిగి పాతిక సంవత్సరములు నేటికి. అప్పటి నుంచి నేను నా భార్య, నా పిల్లలు అందరమూ ఆ శ్రీచక్ర రూపములో కొలువై వున్న అమ్మను అతి భక్తితో కొలుచు కొంటూ వచ్చినాము. అది మొదలు మా జీవితములో ఇప్పటి వరకు మేము ఏ కష్టమూ చూడలేదు మరలా.
అన్ని ఆపదలు ఆమె మా ముందు వుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చినది. ఆర్నెల్ల క్రిందట జరిగిన కారు ఆక్సిడెంట్ లో కూడా కారు నుజ్జు నుజ్జు అయినా నేను సురక్షితముగా చిన్న గాయము కూడా లేకుండా బ్రతికి బయట పడ్డాను.
ఇందంతా అమ్మ దయ కాకుండా ఇంకేమిటి. అమ్మ నాతోనే వున్నది. ఆమెతో నేను వున్నాను.
ఇలా భయంకరమైన పరీక్షలు వస్తాయి. కొంతమందికి తల్లిదండ్రుల రూపములో వస్తాయి. కొంతమందికి వాళ్ళ గురువు రూపములో వస్తుంది. అది తెలుసుకొని అమ్మ పాదములు వదలకుండా పట్టుకొని వుంటే, ఇక ఏ జన్మ లోనూ అమ్మ మనల్ని వదిలిపెట్టదు.
నా వ్యక్తిగత విషయములు ...ఇలాంటి అనుభవాలు ఎన్నో....అమ్మ నాతోనే వున్నది, మా ఇంట్లోనే వున్నది....
 
మీ
శ్రీ భాస్కరానంద నాథ/24-10-2012