Thursday 25 July 2013

విభూతి మహిమ

ధర్మదేవుడు శాపము నొందుట
ఒకప్పుడు అత్రి పుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపము చేసెను. పదివేలయేండ్లు గడచినవి. ధర్మదేవత (యముడు కాడు) ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపము వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. అప్పుడాయన ప్రత్యక్షమై " నీవంటి కోపిష్టి వానికి తపస్సు ఫలించునా? అనగా దూర్వాసుడు "నీ వెవ్వడ" వాణి యడిగెను. ధర్ముడు "నేను ధర్మమూర్తి" ననెను. దూర్వాసుడు మహాక్రోధముతో "నా కోపమును నీ వర్పగాలవా? పదివేలేండ్లు గడచిన తరువాత ఇప్పుడు మేము కనబదితిమా? ఇన్నాళ్ళు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైననూ నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైనట్లు కనబడుచున్నది.నీవు ఇంత దుర్మదాందుడవై బ్రహ్మణాపచారము ఒక రాజువై, ఒక చండాలుడవై పుట్టుము. " అని శపించి లేచిపోయెను. ఆ శాపమువలన విదురుడుగాను, పాండుకుమారులలో జ్యేష్టుడైన ధర్మరాజుగాను, కాటికాపరి తనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించెను.   .........పద్మ పురాణము

సీతాదేవికి చిలుక శాపము   
అది మిథిలా నగరములోని అంతః పురస్త్రీల ఉద్యానవనము. సేతాదేవి చెలికత్తెలతో విహారమునకు వచ్చెను. ఒక చెట్టుమీద చిలుకల జంట ముచ్చట లాడుకొనుచుండెను. అవి వాల్మీకి ఆశ్రమమునుండి వచ్చినవి. మగచిలుక, " ఈ దేశపు రాజుగారి కే సీత నాగటిచాలులో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగము చేసి పెండ్లాడునట" అని భార్యకు చెప్పుచుండెను. అది విన్న సీత, ఆ రెండు చిలుకలను బట్టి తెప్పించెను. వానితో సీత, "మీరెవరిని గురించి మాట్లాడుతున్నారు ? సీతను నేనే. నన్ను గురించియేనా? ఆ రాముడెవడో చెప్పుడు. ఈ సంగతులు మీ కెట్లు తెలిసినవి. "అని అడుగగా "మేము వాల్మీకి ఆశ్రమములోని వారము. విహారమునకై వచ్చినాము. వాల్మీకి ముని రామాయణము అని ఒక గ్రంథము వ్రాయుచున్నాడు. అందులోని కథ చెప్పుచున్నాను. రాముడు అయోధ్యకు యువరాజు" అని శుకములు చెప్పి, తమ్ము వదలమని ప్రార్ధించెను. " ఆ శుభకార్యము జరిగిన తరువాత్ అమిమ్ము విడిచెద" నని సీత యనెను. అవి "మేము స్వేచ్చగా తిరిగేది వారము. పంజరములలో ఉండలేము అదియునుగాక  నాభార్య చూలాలు. శ్రమకు ఓర్వలేదు. దయతో విడిచిపెట్టు" మని కోరెను. సీత, "అయినచో ప్రసవ మగునంతవరకు ఆడచిలుక నాయొద్దనే యుండును. నీవు పొమ్మని" మగ చిలుకను విడిచెను. అది, "తల్లీ, దీనిని విడిచి నేను బ్రతుకలేను. కరుణించి మమ్మిద్దరిని విడిచిపెట్టు" మని దీనముగా ప్రార్ధించెను. కాని సీత వినలేదు. ఆడచిలుక, సీతతో నాభర్త నన్ను విడిచి బ్రతుకలే ననుచున్నాడు. నేనునూ అతనిని విడిచి బ్రతుకలేను. కావున మమ్ము దయజూడు మనెను. సీత వినలేదు. మగచిలుక ఏడుపు ఆడచిలుక గుండెలు పగులగొట్టగా అది సీతను జూచి "యింత కటినురాలవై గర్భవతియైన నన్ను నాభర్తనుండి విడదీసినావు కావున, నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడెదవు". అని శపించి ప్రాణము విడిచెను. మగచిలుక " నాభార్యను అన్యాయముగా చంపినావు. కావున నిన్ను నీ భర్త విడచుటకు మూలకారణుడైన చాకలివాడనై జన్మించి పగ తీర్చుకొందు" ననుచూ వెళ్ళి గంగానదిలో పడి మరణించెను.
సీతను రాముడు అడవిలో విడుచుటకు ఇదియే కారణము ..................పద్మ పురాణము
 విభూతి మహిమ
 
 
కైలాసము నుండి శంకరుడు విప్రవేషముతో నొకనాడు రామునొద్దకు వచ్చెను. రాముడు " తమ నామమును, నివాసమును చెప్పు డనగా ఆయన నాపేరు శంభుడు, కైలాసము నా నివాసము" అనగా అతనిని శంకరుడుగా గ్రహించి రాముడు విభూతి మహిమను చెప్పుడని యడిగెను. శివుడు చెప్పసాగెను.

"రామా! భస్మ మహత్యము చెప్పుటకు బ్రహ్మాదులకు గూడ శక్యము గాదు. బట్ట మీది చారలను అగ్ని కాల్చినట్లు, మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను గూడ తుడిచివేయు శక్తి భస్మమునకు ఉన్నది. విభూతిని మూడు రేకలుగా పెట్టుకోన్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లు అగును.

ముఖమున భస్మమమును ధరించిన నోటి పాపములు (తిట్టుట - అభక్ష్యములను దినుట అను పాపములు), చేతుల పైన ధరించిన చేతిపాపములు (కొట్టుట మొ||) హృదయము పై ధరించిన మనః పాతకములను (దురాలోచనలు మొ||), నాభి స్థానమున ధరించుట వలన వ్యభిచారాది దోషములను, ప్రక్కలందు ధరించుట వలన పరస్త్రీ స్పర్శ దోషములను పోగొట్టును. పాపములను భార్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది గాన భస్మము అను పేరు దీనికి పేరు గలిగెను.

భస్మముమీద పండుకొన్నను, తిన్నను, ఒడలికి పూసికొన్నను పాపములు భస్మీభూతము లగును. ఆయువు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవము గలిగించును. సర్పవృశ్చికాది విషములను హరించును. భూత పిశాచాదులను పారద్రోలును.

వశిష్ట వంశములో ధనంజయుడు అను విప్రుడు గలడు. అతనికి వందమంది భార్యలు, వందమంది కొడుకులు. వారికి తన దానములను సమానముగా పంచి యిచ్చి ఆ విప్రుడు గతించెను. కొడుకులు అసూయతోను, దురాశాతోను ఒక ధనముల కొకరాశపడుచు తన్ను కొనసాగిరి. వారిలో కరుణుడను కొడుకు, శత్రు విజయము సాధించ వలెనని గంగాతీరమున కేగి  స్నామాది తపము చేయవలెననుకొని మునుల సేవ చేయుచుండగా ఒక విప్రుడు నృసింహదేవునికి ప్రీతియని ఒక నిమ్మ పండు దెచ్చి అక్కడ పెట్టెను. దానిని వీడు వాసన చూచెను. అందుకు మునులాగ్రహించి ఈగవై పొమ్మని శపించిరి. వీడు వేడుకొనగా పూర్వస్మృతి నిచ్చిరి. అంతట ఏడ్చుచూ వెళ్లి భార్యతో చెప్పెను. ఆమె పతివ్రత. చాల విచారించెను. ఒకనాడీ సంగతి తెలిసిన వాని సోదరులు పట్టి చంపిరి. అతని భార్య ఈగ దేహమున్ ఉ తీసికొని అరుంధతి దగ్గరకు బోయి ప్రార్ధింపగా ఆమె, మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రితమైన విభూతిని జల్లి, కరుణుని బ్రతికించెను.
.
​....​..................పద్మ పురాణము

--
మీ
శ్రీ భాస్కరానంద నాథ