Monday 26 January 2015

సన్యాసి యోగము – పరిశీలన

సన్యాసి యోగము – పరిశీలన -2  
గురువు జీవ కారకుడు, రవి ఆత్మ కారకుడు, చంద్రుడు మనో కారకుడు, శని కర్మ కారకుడు, కేతువు  మోక్ష కారకుడు, వైరాగ్య కారకుడు.
జాతక చక్రములోని  ద్వాదశ రాశులలో దశమ స్థానము నకు మహా విశిష్టత కలదు. దీనిని రాజ్య స్థానమని, కర్మ స్థానమని, జీవన స్థానమని, సంకర్షణ స్థానమని పిలిచెదరు. ఈ భావమును బట్టియే జాతకుని, జీవుని యొక్క ఐహికాముష్మిక జీవిత విధానములు, స్థితి గతులు తెలియబడును. కావున ఈ రాశి యొక్క బలాబలములు అత్యవసరము. రాజ్య భావములు బలముగా లేకున్నచో మరి ఎన్ని రాజ యోగములు జాతకములో సూచింప బడిననూ, వాటిని జాతకుడు అనుభవించ లేడు. రాజ్య స్థానము, రాజ గ్రహము లైన రవి చంద్రులు ఉన్నతంగా లేనిచో జాతకుడు సామాన్య జీవితమును అనుభవించును. దీని ద్వారా జాతకుని యొక్క జీవనము, వైభవము, పరిపాలన, ఆచార వ్యవహారములు, పుణ్య నదీ స్నానము, దేవతా సిద్ధి, ఆస్తికత్వము, కీర్తి, గౌరవములు, సన్యాస యోగము, పీఠాధిపత్యము మొదలగునవి తెలియును.
౧. రాజ్యమున (10) నాలుగు గ్రహములున్ననూ లేక చూచిననూ జాతకుడు ఐహిక సబంధ విషయములను వదలి వేదాంత జ్ఞానమును పొంది సన్యాసి అగును. రాజ్యాధి పతి ఉచ్చ క్షేత్రముల యందు వున్న జాతకుడు సత్కీర్తి కలవాడు అగును. రాజ్యాధి పతి భాగ్యము నందు, భాగ్యాధిపతి బలీయుడై శుభ గ్రహ దృష్టి చెందగా, లగ్నాధి పతి బలముగా వున్న యెడల జాతకుడు మహా జ్ఞాని అగును. కేతువు సంయోగము ఉన్నచో మోక్ష జ్ఞానములు బడయును.
౨. రవి, బుధ, గురు, శుక్రులు కలిసి ఎక్కడ ఉన్ననూ, నైష్టిక బ్రహ్మచారియై కౌపీనాది దండములను ధరించును.
౩. లగ్న రాజ్యాధిపతులు మూడు గ్రహములతో కలసి ఎచ్చట ఉన్నానూ వేదాంత జ్ఞానము కల వాడుగాని, సన్యాసి కాని అగును.
౩. భాగ్య రాజ్యాధిపతులు, ఆయా స్వ క్షేత్రములలో గానీ , పంచామాధి పతి తో గాని సంబంధము యున్న యెడల చక్రవర్తి యోగము గలుగును.
౪. చంద్రునకు రాజ్యమున బుధ గురు శుక్రులున్న సన్యాసి గాని , వేదాంతి గాని, పీఠాధిపతి గాని అగును.
౫. లగ్న రాజ్యాధి పతులకు గురువుతో సంబంధము వున్న యెడల యజ్ఞాది క్రతువులు, గంగా స్నాన ఫలితము కలుగును. యజ్ఞాది సత్కర్మలు జేయును.
౬. రాజ్యమున రవి యుండి గురు సంబంధము కలిగినచో గంగాది పుణ్య నదుల స్నాన ఫలితము , యాత్రలు చేయును. శని సంపర్కము ఉన్నచో సన్యాసి , వేదాంతి అగును.
౭. చంద్రుడు బలవంతుడై రాజ్యమునందు , లగ్న రాజ్యములకు కేతు స్పర్శ, పంచామునకు శుభ గ్రహ దృష్టి ఉన్నచో ..జప తప యజ్ఞ యాగాదులు చెయు కర్మిష్టి అగును.
పంచమ కోణము (5) ఐహిక సంబంధమైన విషయములు తెలియజేయగా, భాగ్య కోణము (9) ఆముష్మిక సంబంధమైన విషయములను తెలియ జేయును. ఈ భాగ్య స్థానముకు పూర్వ జన్మ సంచిత స్థానమని కూడా పిలిచెదరు. దీనిని బట్టి జాతకుని యొక్క శుభ దుష్కర్మములు , ఐహికాముష్మిక కార్యములు, యజ్ఞ, దాన, తపో కార్యములు,తీర్ధ యాత్రలు, పుణ్య శ్రవణ, కీర్తనము, దేవ బ్రాహ్మణారాధన విషయములు తెలియనగును. మరణానంతరము పొందు లోకములను కూడా ఈ స్థితిని బట్టి తెలియనగును. జాతకుని యొక్క ఆచార వ్యవహారములు,చిత్త శుద్ది, స్వభావము, పరిశుభ్రత , వైభవము, గురు, పితృ, దైవ భక్తి , నదీ స్నానములు, దాన, ధర్మములు, దేవతా పూజార్చానము, తెలియనగును.
భాగ్య స్థానమును ధర్మ స్థానము అని ఐశ్వర్య స్థానమని , పూర్వ జన్మ సంచిత స్థానమని కూడా పిలిచెదరు.
వ్యయ భావము(12):-
ద్వాదశ భావములలో చివరి భావము వ్యయ భావము, దీనిని మోక్ష స్థానమని పిలిచెదరు. ఈ భావము వలన జీవి యొక్క మరణాంతర స్థితి తెలియనగును. జన్మ ఖర్చు, మిగులు, balance sheet, తెలుసుకోవచ్చును. 11, 12 స్థానములను బట్టి  లాభ, నష్టాల పట్టిక తెలుసుకోవచ్చును. కావున సన్యాస యోగము ను గురించి తెలుసుకోవలసిన స్థానములు లగ్నము, ద్వితీయము, పంచమ, సప్తమ, నవమ, రాజ్య, వ్యయ భావములను అందలి గ్రహములను క్షుణ్ణంగా పరిశీలించి చెప్ప వలయును. మాహారాజ యోగము కంటే పీఠాదిపతుల యొక్క యోగము చాలా గొప్పది. ఎందుకంటే ఆ మాహారాజులు వచ్చి సాష్టాంగ నమస్కారాములు చేస్తారు గనుక. అన్ని సుఖ యోగములను త్యజించి జ్ఞాన, వైరాగ్యములతో , పర బ్రహ్మ చింతనతో పీఠములను ఎక్కిన వారికి లోకిక బంధ చింతన ఉండదు, లౌకిక సుఖములు బాధించవు వారిని. వ్యయ స్థానమున శుభ గ్రహములు ఉన్నందువలన మిత వ్యయములు, సత్కార్యములకై ఖర్చు పెట్టుట జరుగును. పుణ్యాత్ములకు , సన్యాసులకు సర్వ కర్మ వ్యయం జరుగుతుంది , అంటే మోక్షం వస్తుంది. యోగులకు వ్యయాధి పతి బలంగా ఉండవలెను. అప్పుడే కర్మ నుంచి విముక్తి లబించును.
భాస్కరానంద నాథ /26-01-2015/srikalahasthi

సన్యాస యోగం....పరిశీలన – 1
మోక్ష కారకుడైన కేతువు, వ్యయాధిపతి బలంగా వుండి, సప్తమాధిపతి మరియు కళత్రకారకుడైన శుక్రుడు బలహీనంగా వుంటే సన్యాస యోగం వరించును. ద్వితీయంలో, నవమంలో, వ్యయంలో కేతువు వున్న మోక్ష యోగం. సప్తమంలో శని కూడా సన్యాస యోగాన్ని ఇస్తాడు. ద్వితీయ, సప్తం లో పాప గ్రహములు సన్యాస యోగాన్ని సూచిస్తాయి. మారక స్థానములైన ద్వితీయ, సప్తమములు సుఖములు ఇస్తాయి. సుఖములు ఏక్కువైతే, అతి సుఖములు దుఃఖాన్ని ఇస్తాయి. కామము, కోరికలు ధనము వలన, సుఖ స్థానమైన సప్తమం వలన కలుగుతాయి. అందుకే ఇవి మారక స్థానములు అయి వున్నవి. సన్యాసి జాతకములో ఈ రెండు స్థానములు చెడి వుండవలయును. బలహీనముగా వుండవలేను. వ్యయ స్థానము, వ్యయాధి పతి బలంగా వుంటూ, ఒకే రాశిలో నాలుగు కంటే ఏక్కువ గ్రహములు వుండవలయును. సుఖ స్థానములపై పాప గ్రహ దృష్టి కలిగి వుండ వలయును. గురువు, పంచమ స్థానాధిపతి బలంగా వుంటే వేదాధ్యయనము, సంస్కృతము, మంత్ర, తంత్ర శాస్త్రములతో మహా జ్ఞాని అగును. లాభాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి లాభ స్థితిగతుడైతే జ్ఞాన చక్రవర్తి, జగద్గురువులు అగుదురు. కర్మాధిపతి వ్యయం లో వున్నా కూడా మహా సన్యాస యోగం కలదు. సన్యాస యోగం, మోక్ష యోగం అనేది ఆధ్యాత్మికంగా గోప్ప రాజ యోగం. పెళ్లి కాని మాత్రాన సన్యాసి కాలేరు అందరూ. సన్యాసులు అందరూ పీఠాధిపతులు కాలేరు. పీఠాధిపత్యం అనేది గొప్ప మహా రాజ యోగం, జన్మరాహిత్య యోగం, చక్రవర్తి యోగం, విదేహ ముక్తి యోగం. సుఖాన్ని త్యాగం చేయగలవాడే విరాగి, సన్యాసి కాగలడు. ...
.భాస్కరానందనాథ


No comments:

Post a Comment