Monday 31 August 2015

పూజ..

ఎవరో చూస్తున్నారనో, వింటున్నారనో లేక భయపడో చేసే పూజ , పూజ కాదు.
నీ కోసం, నీ మనస్సాక్షి కోసం, నీ మనశ్శాంతి కోసం అంటే మనకోసం మనం పూజ చేయాలి. ఆత్మ ఉన్నతి కోసం పూజ చేసుకోవాలి. మనస్సుతో కూడిన శరీర కర్మ ను పూజ అంటారు. మనస్సు లేని క్రియ పూజ అనిపించుకోదు.  శారీరిక క్రియ లేని మానసిక పూజను నిజమైన పూజ అంటారు. మరి క్రియ ఎందుకు?  మనస్సు అక్కడ నిలబడడానికి.  మనస్సుతో కూడిన క్రియను, కల్పమును "పూజ" అని అంటారు...అందుకు వచ్చింది పూజ ..షోడశోపచార పూజ....భగవంతుడు కూడా మన లాంటి వాడిలాగే భావించి ఆయనకు అర్ఘ్యం, ఆచమనీయం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, ఆభరణం , నైవేద్యం, తాంబూలం అంటూ  వివిధ రకాల ఉపచారములు చేసి  హారతి ఇచ్చి హమ్మయ్య నాకూ నిద్ర వస్తున్నది ....నీవు బజ్జుకోవయ్యా  ...అంటూ మంగళ హారతులు ఇచ్చి పవళింపు సేవ చేసి మనం కూడా పడుకొంటాము....ఇది మనం చేసే నిత్య పూజ....ఎందుకంటే భగవంతున్ని మనలాగా పోల్చుకొని, మనకు కావలసిన, కోరుకొంటున్న ఉపచారములు అన్నీ భగవంతుడు కూడా మనలాగే అనుకొని తీర్చుకొంటున్నాము కృతజ్ఞతా భావముతో....మనం గుర్రం, ఏనుగు ...వాహనములు కోరుకొంటాము కాబట్టి ఆయన్ను కూడా గుర్రం ఎక్కిస్తాము.....మనకు సుగంధ ద్రవ్యములు కావాలి కాబట్టి ఆయనకు చల్లాము...మనకు మధుర పదార్ధములు కావాలి కాబట్టి ఆయనకు నివేదించుకొన్నాము........నిజానికి భగవంతుడికి ఇవన్నీ కావాలనా ? పల్లేదు....మరి ఎందుకు ఇస్తున్నాము?  మన తృప్తి కోసం......మనకు అవన్నీ కావాలి కాబట్టి, మనలోని ఆ పరమాత్మకు అవన్నీ నివేదిస్తున్నాము........నేను బ్రాహ్మణున్ని నాకు చక్కేర పోంగలి ఇష్టం, నేను అదే తింటాను కాబట్టి భగవంతుడికి కూడా అదే పెడతాను.....నాకు పట్టు పంచలు ఇష్టం కాబట్టి భగవంతుడికి కూడా అవే పెడతాను.....ఓక బెస్తవాడు వున్నాడు, వాడు చేపలు తింటాడు, వాడు భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు చేపలు మాత్రమే పెడతాడు,  కల్లు ఇస్తాడు, పానకం ఇవ్వడు, దద్ధోజనం పెట్టడు.....ఆ చేపలు తిని, కల్లు త్రాగి భగవంతుడు వాడ్ని అనుగ్రహిస్తాడు....అదేమిటి భగవంతుడు కల్లు త్రాగుతాడా అంటే త్రాగుతాడు....కన్నప్ప మాంసం పెడితే తినలేదా? అసలు ఇన్ని రూపాలలో తింటున్నది, త్రాగుతున్నది ఏవరు ? ఆ విశ్వంభరుడే...
ఎవడు ఏ రూపంలో వుంటాడో అదే రూపంలో భగవంతుడు వుంటాడు అని భావించి తనకు ఇష్టమైన, తను తినే పదార్ధములనే భగవంతుడికి పెడతాడు...అదే భక్తి. మనం ఏది తింటామో, భగవంతుడు కూడా అదే తింటాడు, అదే త్రాగుతాడు....జాతికి తగ్గట్టు, వర్ణానికి తగ్గట్లు, సాంప్రదాయమునకు తగ్గట్లు పూజ వుంటుంది, నైవేద్యం  వుంటుంది. ఇది తప్పు అని చెప్పడానికి మనం ఎవ్వరం?
ఓక గిరిజన కన్య వాళ్ల కొండ దేవతకు పొట్టేలు మాంసం పెట్టి, విప్ప సారా పోస్తుంది. అలా మనం చేయగలమా? లేము. కారణం మనం తినడం లేదు కాబట్టి....నీ ఇంటి ఆచారం ప్రకారం, ధర్మం ప్రకారం నీవు చెయ్యి. నీ పెద్దలను, గురువులను అనుసరించు..ఇతరులను అనుసరించ వద్దు.
ఓక పందిని వెళ్లి ...." భగవంతుడు"... ఏలా వుంటాడు అని అడిగితే, ......" నా లాగే పంది రూపంలో"...వుంటాడు అని చెబుతుంది....అదే విధముగా కుక్క, నక్క, చిలుక, పక్షి,  ఏనుగు, చీమ, చేప......ఇలా అన్నీ తమ తమ రూపాలలో వుంటాడు భగవంతుడు ...అని చెబుతాయి...
మనిషిని అడిగితే మనిషి కూడా చెబుతాడు భగవంతుడు తన లాగే మానవ రూపంలో వుంటాడు అని.   మరి నిజంగా భగవంతుడు ఏ రూపంలో వుంటాడు?  అన్ని రూపాలలో వుంటాడు....ఏవరి భావనకు తగ్గట్లుగా ఆ ఆకృతిలో పట్టుకోవడానికి వీలుగా భగవంతుడు వుంటాడు....చేప రూపంలో వుండడు అని చెప్పడానికి మనం ఎవ్వరమూ?  ఏమో వుంటాడేమో?? పంది రూపంలో వుంటాడేమో, మనిషి రూపంలో వుంటాడేమో, జ్యోతి రూపంలో, చెట్టు రూపంలో, పుట్ట రూపంలో, పక్షి రూపంలో......రకరకాల రూపంలో వుంటాడేమో........ఇన్ని జీవరాసులు వున్నప్పుడు ఖచ్చితంగా ఆయా రూపాలలో భగవంతుడి వుండి వుంటాడు.......
కాబట్టి భగవంతుడు అంతటా, అన్నింటా వున్నాడు అని పెద్దలు అంటారు.....అంతటా నిండి నిబిఢీకృతమైన ఆపరమాత్మకు నిత్య పూజలు మనం చేస్తున్నాము.....
మీ భాస్కరానంద నాథ/12-07-2014

Sunday 16 August 2015

ప్రకృతిని కాపాడండి....భగవంతుడు కనిపిస్తాడు...

ఈ ప్రకృతిలో, సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణినీ తిరిగి పుట్టించ వచ్చును...ఏందుకంటే అవి ఈ మట్టిలోనే కలిసిపోయినాయి కనుక....ఈ మట్టిలోని అణువణువులో వాటి రేణువులు దాగి వున్నాయి...వాటిల్ని పునర్జీవితం చేయడానికి తగిన శక్తి మనకు కావాలి...క్రొత్తవి మనం సృష్టించలేము కానీ ఓకసారి రూపము తీసుకొన్న వాటిని తిరిగి బ్రతికించవచ్చును...

యుగ ధర్మం,  కాల ధర్మం అని ఓకటి వున్నది...అది భగవంతుడే....ఆ భగవంతుడే యుగ ధర్మాన్ని కాదని భక్తుని కోసం ప్రకటితమౌతూ వుంటాడు...భక్తుని సాధన అంత గొప్పది...
నారదుడు ఏ కాలం నాటి వాడు అని త్యాగరాజు కు కనిపించినాడు?
కాళి ఏకాలం నాటిది అని రామకృష్ణులకు కనిపించినారు?
రాముడు ఏ కాలం నాటి వారు అని తులసీదాసుకు, రామదాసుకు కనిపించినారు?
వేంకటేశ్వరుడు ఏ కాలం నాటి వాడు అని అన్నమయ్యకు, బావాజీ కి కనిపించినారు?
ఇప్పటికీ నిజమైన భక్తులకు, సాధకులకు ఆ కాలం నాటి దేవతా రూపములు కనిపిస్తున్నాయి.

ఏలా?  ఏలా?

మంత్ర శక్తితో, నామ శక్తితో, తపస్సుతో, పూజతో ఆ దివ్య స్వరూపములను క్రిందకు దించుతున్నాము....వాటి సూక్ష్మ రూపములను ఆవాహన చేస్తున్నాము....తపస్సుతో మన నేత్రములను దివ్య నేత్రములు గా చేసుకొని ఆ దివ్య స్వరూపములను చూడవచ్చును, అలా చూసిన మహాపురుషులు వున్నారు, దేవతలతో మాట్లాడిన వాళ్లు వున్నారు...

దేవతలనే కాదు పితృ దేవతలను కూడా ఆవాహన చేసి వారి సూక్ష్మ రూపములను గాంచి మాటలాడి వచ్చును...

ప్రకృతిలో కలిసిపోయిన వారి అణువులను ఆత్మలను ఆవాహన చేసి, వారి సూక్ష్మ రూపములను చూడవచ్చును, మాట్లాడ వచ్చును...

కావలసినది తపఃశక్తి....భక్తి...ఉపాసన...మంత్ర సాధన...

ఆరు నెలలు నియమ నిష్టలతో ఉపాసన చేస్తే నీకు అనుభవం అవుతుంది ఇది...
దేవతా శక్తుల యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది....

కావలసినది నీకు స్వార్ధ చింతన లేని మనసు....సృష్టికి హాని తలపెట్టని మనసు...
సర్వ జనుల మీద, సమస్త ప్రాణి కోటి మీద ప్రేమానురాగాలు, త్యాగము, ఆర్తి, సహాయము.

నీ ఆత్మ ఉద్ధరణ కొరకు సాధన చేస్తే తప్పక భగవంతుడు నీకు కనిపిస్తాడు ఈ జన్మలోనే..
నీ కంటితో నీవు చూడవచ్చును, పూజించ వచ్చును...

ప్రతి ప్రాణినీ ప్రేమించు....భగవంతుడి సృష్టిలోని ఏ ప్రాణికీ హాని చేయ వద్దు, ధర్మంగా బ్రతుకు..
తల్లిదండ్రులను, గురువులను పూజించు....భగవంతుడు కనిపిస్తాడు...

ఎవ్వరినీ చంపకు, ఆఖరాకి చీమనైనా సరే....ప్రేమించు....స్త్రీ మూర్తిని పూజించు, గౌరవించు...భగవంతుడు కనిపిస్తాడు....స్త్రీ ప్రకృతి మాత ఆమెను గౌరవించు, పూజించు భగవంతుడు కనిపిస్తాడు....స్త్రీ శాంతి మూర్తి ...ఆమెను పూజించు భగవంతుడు కనిపిస్తాడు..

నీ భార్యలో ఆది శక్తిని చూడు, నీ తల్లిదండ్రులలో పార్వతీ పరమేశ్వరులను చూచి పూజించు.
స్నేహితులలో నారాయుడ్ని చూడు......భగవంతుడు ఇక్కడే ఇప్పుడే కనిపిస్తాడు...

మీ గురువులలో ఆది శంకరాచార్యులను చూడు....భగవంతుడు కనిపిస్తాడు...
మనిషిని మనిషి లాగ, ప్రాణిని ప్రాణిలాగ చూసే శక్తి వున్నదా....భగవంతుడు కనిపిస్తాడు..

ఆడ పిల్లలను, కోడల్లను చంపకండీ...వారిని పాడు చేయకండి, ఆడది ప్రేమ మూర్తి...నీకు సుఖాన్ని, శాంతిని చేకూర్చే మహా శక్తి స్వరూపిణి....నీకు తల్లి వంటిది....భగవంతుడు కనిపిస్తాడు...

భగవంతుడు కనిపిస్తాడు........
భగవంతుడు కనిపిస్తాడు
భగవంతుడు కనిపిస్తాడు......తప్పక కనిపిస్తాడు....నీతో ఆడుకొంటాడు..
ఇది సత్యం......... ఇది సత్యం......... ఇది సత్యం

Saturday 15 August 2015

శ్రీవిద్యోపాసకులు.

శ్రీవిద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వుంటారు.  చిన్న పిల్లల మనస్త్వత్వంతో ఆడుతూ పాడుతూ వుంటారు......ఆనంద తాండవంలో మునిగి తేలుతూ తమాషా చూస్తూ వుంటారు.....ఎవ్వరినీ నిందించి లేరు....
వ్యక్తిగత పగలు ద్వేషాలు తెలియవు వారికి. సమస్త ప్రాణి కోటిని అష్టావర్ష భవేత్ అన్నట్లుగా 80 ఏండ్ల ముసలి వాళ్లు కూడా 8 ఎండ్స్ బాలికామణిలాగ కనిపిస్తూ వుంటుంది. అదే శ్రీవిద్యోపాసన....నరనరాలలో అమ్మ తనం నిండిపోయివుంటుంది...జగన్మాత లాగ మాట్లాడుతూ వుంటారు.....ప్రపంచంలో వున్న కుళ్లు కుతంత్రాలను చూసి బాధపడుతూ వుంటారు, ఓక్కోసారి ఆనంద తాండవం చేస్తూ వుంటారు....కడు విచిత్రంగా ప్రవర్తిస్తూవుంటారు....మన భావనలకు అందరు...ఎవ్వరినీ గుర్తు పెట్టుకొని పగ సాధించడం అనేది అసలు వుండదు, అహంకారం వుండదు.
ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన చేయలేరు.....ఎవరిలో ఈ దుర్గుణములు వుంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు.....తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు....గురుపరంపరకు మచ్చ రానీయరు.  సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురు దేవుళ్లు, గురు త్రయం కాపాడుతూ వస్తుంది....చేసిన పొరబాట్లను గురించి తక్షణమే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూవుంటాయి.
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరుల యోక్క మానసిక స్థితి కడు బిన్నముగా వుంటుంది...వారు అన్న ప్రతి మాటకూ ఓక అర్థం వుంటుంది....అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి ...అది ఆమే భాధ్యత.
వీరు అహంకారంతో, ఆగ్రహంతో ఏప్పుడూ మాట్లాడరు.....అయితే అలా కనిపిస్తూ వుంటారు కారణం వారి వెనుక శ్రీ భవానీ వున్నది అని నమ్మకంతో....వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఓడిలో పడుకొని నిద్రపోతారు....పూర్ణవిద్యాపరులు అంటే సాక్షాత్తు స్వయం కామాక్షీ స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ వుంటారు,  కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి...
అహం భావయే భవానీం....అని ఊపిరి పీలుస్తూ వుంటారు....అటువంటి భవానీ స్వరూపమునకు కొందరిమీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం వుండదు....శ్రీవిద్యోపాసకులతో మాటలాడే వ్యక్తుల యోక్క భావనలు తమంతట తాముగా బయట పడుతాయి....అందుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి....ప్రకృతిని శాసించే మంత్ర శక్తులు వీరి దగ్గర ఎక్కువగా వుంటాయి.....వీరి శరీరం మంత్రపూరితం అయ్యి వుంటుంది, పైకి అతి సాధారణముగా కనిపించినా లోన అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదామ్యత చెంది అణుసంధానమై వుంటారు...అందుకే తమలో తాము నవ్వుకొంటూ వుంటారు....నీవు పొగడినా, తిట్టినా ఒక్కటే విధముగా నవ్వుతూ వుంటారు. కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు, తమ పుణ్యం కూడా ఆఖరాకి తమ ప్రాణాలు సహితం ధారపోస్తారు.....అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారి ప్రాణాలు తీయరు. కారణం అమ్మ ప్రాణ స్వరూపిణి, మాతృ స్వరూపిణి ....ప్రాణాలు ఇవ్వడమే వీరి లక్ష్యం.....పూర్ణ దీక్షాపరులైన శ్రీవిద్యోపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తూ వుంటారు....ఇటువంటి వారికి ఓక్కపూట భోజనం పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది....
శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను,  ముక్కోటి దేవతలను త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామకామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క.....
సాక్షాత్తు శ్రీదేవీ స్వరూపమైన శ్రీవిద్యోపాసకులు ఓక్క వారి గురువలకు తప్పించి లోకంలో మరెవ్వరి పాదములకూ నమస్కరించరు.....ప్రతి ప్రాణిలోనూ మాతృ భావన చేసి, మాతృ మూర్తిగా దర్శిస్తూవుంటారు.....వీరి శరీరభాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ వుంటుంది...అదే శ్రీవిద్యోపాసన.

వీరు ఏవ్వరి దగ్గర నుంచీ ఏమీ ఆశించరు....వీరికి కావలసిన వన్నీ అమ్మ సమకూర్చి పెడుతూ వుంటుంది...నోటిలోమాట నోటిలో వుండగానే సకలాభీష్ఠదాయిని తధాస్తు ..అని అంటుంది.

చాలా చాలా దుర్లభమైన విద్య.......నిలుపుకోవడం చాలా కష్టం..
పాదుకాంత పూర్ణదీక్షాపరులుగా వున్న వారిని మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును....పూర్వ జన్మ సుకృతం, పుణ్యఫలం, గురువుల అనుగ్రహం లేకపోతే పూర్ణదీక్ష రాదు....వచ్చినా నిలబడదు...
ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య....
అటువంటి మహా యజ్ఞమును చేస్తున్న మహా పురుషులకు నమస్కరిస్తూ....

Wednesday 12 August 2015

మనసు చేసే వింత చేష్టలు...

పంచభూతములు పంచేద్రియములకు ప్రతీక అంటారు....ఆ పంచేద్రియములను మనం జయించిన నాడు పంచ భూతములు మనకు వశం అవుతాయి.... ప్రకృతి మనకు వశం అవుతుంది....అంటే మాయ మన మీద పని చేయదు....అప్పుడే భోగి యోగి అవుతాడు...యోగి జ్ఞాని అవుతాడు....ముందుగా మనం పంచభూతములను గౌరవించడం, సముచితంగా, నిర్ధిష్టంగా, అవసరములకు తగినంతగా వాడుకోవడం తెలుసుకొని వుండాలి....ఏవరైతే ప్రకృతిని గౌరవిస్తారో...వారిని ప్రకృతి కూడా కాపాడుతుంది...మనసు పంచేద్రియముల ద్వారా సుఖమును అనుభవిస్తూ వుంటుంది.....చేయకూడని పనులన్నింటినీ మనసు చూడమని అంటూ వుంటుంది...ఆ మనసును కట్టడి చేస్తే పంచేద్రియములు దారికి వస్తాయి.....ఒకవేళ పంచేద్రియములు చేయకూడని పని చేసినా, మనసు తాదాత్మ్యత చెందకుండా వుంటే, పొందకుండా వుంటే ఆ పాపం అంటదు....
నిత్య బ్రహ్మచారి, నిత్య ఉపవాసం అంటే ఇదే....భోగముల యందు అనురక్తి లేకుండా వుంటే, ఆ భోగము అనుభవించిననూ భోగ ఫలితం అంటదు.....
పంచ భక్ష్య పరమాన్నములు తిన్ననూ కటిక ఉపవాసం వున్న ఫలితాన్ని లెక్క కడతారు....
చూడని వస్తువును చూసిననూ చూడనట్లే.....
గృహస్థాశ్రమ ధర్మంలో ఈ విధముగా వుండటమే బ్రహ్మచర్యం అందురు....
శాస్త్రము చెప్పిన నియమములను పాటిస్తూ, శౌచమును పాటిస్తూ భార్యతో కలిసి వుండటమే గృహస్థులకు బ్రహ్మచర్యం. ఉపవాసం....
తాదాత్మ్యత ఓక్క భగవంతునితోనే వుండాలి, మిగతా భోగ వస్తువులతో వుండకూడదు...
పెట్టినది తినడం, దొరికినది తినడం ఉపవాసమే....శరీరమును కాపాడుకోవడానికి తినాలి..బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకకూడదు....అప్పుడు కోరికను జయించినట్లు అవుతుంది....లేదంటే కోరిక మనల్ని జయిస్తుంది, దానికి మనం బానిసలం అవుతాము...
బాగా ఆలోచిస్తే భౌతిక విషయములలో  మనసు  తాదాత్మ్యత చెందకుండా వుంటే కొంత పురోభివృద్ధి సాధించినట్లే ....
అయితే మనసు ఒకటి జయిస్తే పరీక్ష మరో రూపంలో వస్తుంది, ఎక్కడో చోట మాయ మనల్ని పడగొట్టుతూ వుంటుంది...అనుక్షణం మనల్ని మనం పరీక్ష చేసుకొంటూ, ఓక్కోక్కటి జయిస్తూ మహాత్ముల చరిత్రను ఆదర్శంగా తీసుకొంటూ ముందుకు నడవాలి.....ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా విజయం మనదే, అప్పటిదాకా ఆగకూడదు....నడుస్తూ వుండాలి...మారుతూ, మార్చుకొంటూ జన్మను సాఫల్యం చేసుకోవాలి....
లేకపోతే మన ఈ జన్మకు అర్ధం ఏమున్నది చెప్పండీ.....
నాది అని అనేది ఓక్కటే కర్మ ఫలితం, అది పాపం గానీ పుణ్యం గానీ.....
ఏమున్నది చెప్పండీ.....నా మంచితనం, నా చెడ్డతనం నాతో వస్తాయి, ఏమి మూట కట్టుకొని పోతానో బాగా తెలిసి వున్న వాడ్ని....
అల్పుడను....ఏదో తిన్నగా, చిన్నగా అనుభవములోకి తెచ్చుకొంటున్నాను....మనసు చేసే వింత ఆటలను శ్రద్ధగా గమనిస్తూ తెలుసుకొన్నది ప్రక్క వారితో అభిమానం, అహంకారం లేకుండా అతి చిన్న వాడినై పంచుకొంటున్నాను మనసు వుండబట్టలేక ....
ఆడుతున్నాను, గెంతులేస్తున్నాను....నన్ను నేను మైమరచి.....జరిగే ప్రతిదీ అమ్మ లీలగా ప్రగాఢంగా భావిస్తూ, భావన చేస్తూ.....

పంచభూతములకు కృతజ్ఞతగా పంచ పూజలు సమర్పించుకొంటూ...

లం......పృథివీ ..తత్త్వాత్మికాయై నమః .......గంధం పరి కల్పయామి,
హం ... ఆకాశ  ..తత్త్వాత్మికాయై నమః........పుష్పం పరికల్పయామి
యం ....వాయు .తత్త్వాత్మికాయై నమః......ధూపం పరికల్పయామి
రం.......వహ్ని    తత్త్వాత్మకాయై నమః........దీపం పరికల్పయామి
వం .....అమృత  తత్త్వాత్మికాయై నమః........అమృత నైవేద్యం పరికల్పయామి
సం.....సర్వం     తత్త్వాత్మికాయై నమః........సర్వోపచారాన్  పరికల్పయామి

శ్రీమాత్రేనమః ....